జేఎల్‌ఎంల ఇష్టారాజ్యం! | - | Sakshi
Sakshi News home page

జేఎల్‌ఎంల ఇష్టారాజ్యం!

Jun 2 2025 1:43 AM | Updated on Jun 2 2025 1:43 AM

జేఎల్‌ఎంల ఇష్టారాజ్యం!

జేఎల్‌ఎంల ఇష్టారాజ్యం!

పలమనేరు: గ్రామాల్లో ఎలాంటి విద్యుత్‌ సమస్యలొచ్చినా వెంటనే బాగు చేసేందుకు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం సచివాలయ సేవల్లో భాగంగా జూనియర్‌ లైన్‌మన్‌ (జేఎల్‌ఎం) విధానాన్ని ఏర్పాటు చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయ వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అయిపోయింది. ఇందులోని ఉద్యోగులు పలు రకాల సర్వేల్లో మునిగిపోయారు. ఫలితంగా సచివాలయాల్లో ఎలాంటి సేవలు లేకుండా బోసిపోయింది. ఈ నేపత్యంలో అత్యవసర సేవలంటూ హాజరు నుంచి వెసులుబాటు ఉన్న జూనియర్‌ లైన్‌మన్‌లు అటు సచివాలయాలకు రాకుండా ఇలా ప్రజలకు అవసరమైన సేవలు చేయకుండా నెల నెలా జీతాలు మాత్రం తీసుకుంటూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. వీరిని పర్యవేక్షించాల్సిన సంబంధిత మండలాల ట్రాన్స్‌కో అధికారులు అసలు పట్టించుకోవడం లేదు. ఇక సచివాలయాలకు బాధ్యులైన ఎంపీడీవోలకు వీరిపై ఆజమాయిషీ లేదు.

జేఎల్‌ఎం విధులు

ఆయా పంచాయతీలోని సీనియర్‌ లైన్‌మన్‌కు సహాయకులుగా ఉంటూ గ్రామాల్లో విద్యుత్‌ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి. పంచాయతీలో నూతన విద్యుత్‌ స్తంభాలు, లైన్ల ఏర్పాటు చేపట్టాలి. ఏదేని మరమ్మతలు వస్తే వెంటనే స్పందించాలి. ప్రజలకు అవసరమైన విద్యుత్‌ సమస్యలను వెంటనే బాగుచేయాలి. ఎందుకంటే మండల స్థాయిలో ట్రాన్స్‌కోలో పనిచేసే సిబ్బంది తక్కువగా ఉండడంతో సమస్యల పరిష్కారం ఆలస్యమవుతుందనే గ్రామ స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండేలా గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వీరిని నియమించి సచివాలయాలకు అనుసంధానం చేసింది.

జరుగుతున్నదేమిటంటే..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సచివాలయంలో పదిశాఖల చెందిన వారికి పలు రకాల సర్వేలను అంటగట్టింది. అయితే వీరు ఉదయం, సాయంత్రం విధిగా సచివాయలాల వద్దకెళ్లి హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ అత్యవసర సేవల్లో ఉన్నందున జేఎల్‌ఎంలు మాత్రం ఏ సచివాలయం వద్దనైనా హాజరు వేసుకునే వెసులుబాటు ఉంది. దీంతోపాటు వీరికి ఎలాంటి సర్వేలు లేవు. దీన్ని ఆసరాగా చేసుకొని 80శాతం మంది జేఎల్‌ఎంలు అసలు విధులకు హాజరు కావడంలేదు. కనీసం సంబంధిత ట్రాన్స్‌కో ఏఈలు చెప్పిన పనులు చేయడం లేదు. ప్రజలకు సంబంధించిన సేవలు చేయాలన్నా ఎంతో కొంత చేతిలో పెడితేగానీ పనులకు రావడంలేదు. ఎందుకంటే వీరిపై అజమాయిషీ ఎంపీడీవోలకు లేదు.

జేఎల్‌ఎంలపై ఎంపీడీవో ఫిర్యాదు

జిల్లాలో మొత్తంగా వీరి పనితీరు సరిగ్గాలేదనే విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో బైరెడ్డిపల్లి ఎంపీడీవో రాజేంద్రబాలాజీ తాజాగా ఆ మండలంలోని పదిమంది జేఎల్‌ఎంలు విధులకు రావడంలేదని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈకి ఫిర్యాదు చేశారు. వీరికి జీతాలను ఆపేయాలని సూచించారు. కానీ ట్రాన్స్‌కో దీనిపై అసలు పట్టించుకోలేదు. దీంతో జేఎల్‌ఎంలు ఇప్పుడు ఎవరిమాట వినే పరిస్థితి లేదని తెలిసింది.

నెలకు జీతం రూ.35వేలు వృథానేనా?

సచివాలయాల్లోని జేఎల్‌ఎంలకు నెలకు వేతనం రూ.35వేలుగా ఉంది. అంటే రోజుకి వెయ్యికిపైగానే. కానీ వీరు చేసేందుకు ఎలాంటి పనిలేకుండా పోయింది. అసలు వీరిని పట్టించుకోవడం లేదు. వీరిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వీరిని ఆయా శాఖలకు అనుసంధానం చేస్తామన్నారు. మళ్లీ సచివాలయాలను బలోపేతం చేస్తామన్నారు. కానీ ఎలాంటి నిర్ణయం తీసుకోక సచివాలయ వ్యవస్థ రోజు రోజుకూ నిర్వీర్యమవుతోంది.

విధులకు డుమ్మా కొట్టి జీతాలు పొందుతున్నవైనం

పట్టించుకోని ట్రాన్స్‌కో అధికారులు

అత్యవసర సేవల పేరిట ఆడింది ఆట పాడిందేపాట

జేఎల్‌ఎంల సమాచారం

జిల్లాలో మొత్తం మండలాలు : 31

గ్రామపంచాయతీలు : 797

మొత్తం గ్రామాలు : 822

సచివాలయాలు : 11,158

వీటిలో జూనియర్‌ లైన్‌మన్‌లు : 11వేలమంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement