రైతులతో కలెక్టర్ చర్చలు
కుప్పం: రామకుప్పం, శాంతిపురం మండలాల పరిధిలో ఇండస్ట్రియల్ పార్కు కోసం భూములు ఇవ్వమని ఆందోళన వ్యక్తం చేసిన రైతులతో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ చర్చలు జరిపారు. శుక్రవారం కడా పీడీ కార్యాలయంలో రామకుప్పం, శాంతిపురం మండల్లోని అమ్మారిపేట, 30–సొన్నేగానిపల్లి, దండికుప్పం, కిలాకిపోడు, మణీంద్రం, బందలగుట్ట, కడచినకుప్పం, విజలాపురం గ్రామాల్లోని రైతులతో చర్చించారు. గతంలో విమానాశ్రయం కోసం ప్రభుత్వం ఇప్పటికే భూములు తీసుకుందని, ఉన్న కొద్దోగొప్పో భూములను ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకుంటే తమ జీవనం దుర్భరమైపోతుందని కలెక్టర్‌తో బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం తమకందరికీ ఎకరా, 50 సెంట్లు పొలం మాత్రమే ఉందని, ఆ పొలంలో పశుగ్రాసం సాగుతో పాడి పరిశ్రమ ద్వారా జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల కోసం ఉన్న కొంత భూమిని కూడా లాక్కుంటే తమ జీవనం కష్టతరమవుతుందన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్సీ కంచెర్ల శ్రీకాంత్ మాట్లాడుతూ పరిశ్రమలు రావడంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, రైతులు అభివృద్ధికి సహకరించాలని సూచించారు. భూములు నష్టపోయిన రైతులకు న్యాయం చేస్తామని, కోల్పోయిన భూములకు మెరుగైన నష్టపరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై పలువురు రైతులు అసహనం వ్యక్తం చేస్తూ తమ భూములు ఇవ్వలేమని చెప్పినట్లు సమాచారం. ప్రత్యేకంగా ప్రతి రైతుతో చర్చించి, సర్దుబాటు చేస్తామంటూ కలెక్టర్ రైతులకు హామీ ఇచ్చారు.
గోడు విన్నవించుకున్న రైతులు
న్యాయం చేస్తామన్న జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్


