కుట్టుమిషన్ల పేరిట బీసీలకు కుచ్చుటోపీ
● వైఎస్సార్‌సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు పవిత్ర
పలమనేరు: కుట్టు మిషన్ల పేరుతో బీసీలకు కూటమి ప్రభుత్వం కుచ్చుటోపీ పెట్టిందని వైఎస్సార్ సీపీ విశ్వబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు ఎస్‌ఎం పవిత్ర తెలిపారు. పలమనేరులో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ బీసీ మహిళలకు చేయూత ద్వారా అందజేసే కుట్టుమిషన్లు సక్రమంగా అందించలేదన్నారు. కేవలం ఇందులో కమీషన్ల కోసం నాసిరకమైనవాటిని ఎంపిక చేశారని విమర్శించారు. మరోవైపు లబ్ధిదారులను పెంచి, తద్వారా కూటమి ప్రభుత్వం రూ.245 కోట్లను దోచుకుంటోందని ఆరోపించారు. ఓ కుట్టుమిషన్ ధర రూ.4,300, టైలరింగ్ శిక్షణకు రూ.3 వేలు మొత్తం కలిపి రూ.7,300 అవుతుందని, రాష్ట్రంలో లక్షమంది లబ్ధిదారులకు రూ.73 కోట్లు అవుతుందన్నారు. అయితే ప్రభుత్వం ఇందుకు రూ.245 కోట్లు చూపడం కూటమి అక్రమాలకు నిలువెత్తు సాక్ష్యమని విమర్శించారు. ఇదంతా చూస్తుంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రజల బాగు కోసం కాదని, కేవలం నేతల జేబులు నింపుకోవడానికే మాట చెప్పాల్సివస్తోందన్నారు.


