కమిషనర్ చిన్నయ్యపై చర్యలు?
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగర పాలక సంస్థలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి, ప్రస్తుతం సూళ్లూరుపేట మున్సిపల్ కమిషనర్‌గా పనిచేస్తున్న చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ (డీఎంఏ) వారం క్రితం ఆదేశాలు జారీ చేసింది. విధుల్లో చేరడం, ఉద్యోగోన్నతులు పొందడంలో అక్రమాలకు పాల్పడినట్లు అందిన ఫిర్యాదులపై విచారణ చేపట్టిన అనంతపురం మున్సిపల్ ఆర్‌డీ విశ్వనాథ్ నివేదిక మేరకు చిన్నయ్యను వెంటనే సూళ్లూరుపేట కమిషనర్‌గా రిలీవ్ చేస్తూ.. చిత్తూరు కార్పొరేషన్‌లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా నియమించి, విధుల్లో చేరిన తర్వాత సస్పెండ్ చేసి, క్రిమినల్ కేసు నమోదు చేయాలని పేర్కొంది. అలాగే చిన్నయ్యకు అపాయింట్‌మెంట్ ఆర్డర్, ప్రమోషన్లు ఇచ్చిన అధికారులపై సైతం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. అయితే దీనిపై చిన్నయ్య హైకోర్టును ఆశ్రయించడంతో జీఓపై కోర్టు స్టే విధించింది. అయితే చిన్నయ్యపై క్రమశిక్షణ చర్యలు చేపట్టే దిశగా అధికారులు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు.
శ్రీవారి దర్శనానికి
15 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 31 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 84113 మంది స్వామివారిని దర్శించుకోగా 33,868 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.12 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనమవుతోంది. దర్శన టిక్కెట్లు లేని భక్తులకు 15 గంటల్లో దర్శనం లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన భక్తులకు 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.


