చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు | - | Sakshi
Sakshi News home page

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు

May 2 2025 1:49 AM | Updated on May 2 2025 1:49 AM

చెట్ట

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు

పాలసముద్రం : ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీ కొనడంతో డ్రైవర్‌కు తీవ్ర గాయా లు కాగా, ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం పాలసముద్రం మండంలంలో చోటు చేసుకుంది. పల్లిపట్టు ఎస్‌ఐ రమేష్‌ కుమార్‌ కథనం మేరకు.. తిరుపతి నుంచి వెంగళరాజుకుప్పం గ్రామానికి ఏపీ 26 జెడ్‌ఓ 162 ఆర్టీసీ బస్సు ప్రయాణికులతో బయలుదేరింది. తమిళనాడు వడకుప్పం వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో బస్సు ముందు భాగం నుజ్జు నుజ్జు అయ్యింది. బస్సు డ్రైవర్‌ రామమూర్తి సీట్‌లో ఇరుకుపోయాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. కాగా బస్సులోని మునస్వామి, చంద్రశేఖర్‌ అనే ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు డ్రైవర్‌న్ని బయటకు తీసి, తిరుత్తణి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పల్లిపట్టు ఎస్‌ఐ రమేష్‌కుమార్‌ తెలిపారు.

వ్యక్తికి గాయాలు

పుంగనూరు: ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడడంతో ఓ వ్యక్తి గాయపడిన సంఘటన మండలంలోని చదళ్ల సమీపంలో గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. సోమల మండలానికి చెందిన శ్రీనివాసులు(45) తన టమాట పంటకు పుంగనూరు పట్టణంలో క్రిమిసంహారక మందు కొనుగోలు చేసి, తిరిగి సోమల వైపు వెళుతుండగా ప్రమాదవశాత్తు ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో శ్రీనివాసులుకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో చికిత్స నిమిత్తం మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇంజినీర్‌ దుర్మరణం

పుంగనూరు: రోడ్డు ప్రమాదంలో ఓ ఇంజినీర్‌ మృతి చెందిన సంఘటన పట్టణంలోని బాలాజీ థియేటర్‌ వద్ద గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని అండిగానిపల్లికు చెందిన రవితేజ(24) బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీ లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. రవితేజ స్వగ్రామానికి వచ్చి తన సొంత పనుల నిమిత్తం ద్విచక్రవాహనంలో పుంగనూరు పట్టణానికి వచ్చాడు. బాలాజీ థియేటర్‌ వద్ద వెళుతుండగా అతివేగంగా వస్తున్న ప్రైవేటు బస్సు రవితేజ వాహనాన్ని ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు శవాన్ని పోస్టుమార్టానికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

పరుగున వచ్చి కుప్పకూలిపోయాడు!

పూతలపట్టు (కాణిపాకం): చిత్తూరు–తిరుపతి జాతీయ రహదారిపై పూతలపట్టు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలో గురువారం ఓ లారీ డ్రైవర్‌ తన వాహనాన్ని ఆపి, సమీపంలో ఓ ప్రైవేట్‌ క్లినిక్‌ వద్దకు పరుగున వెళ్లి కుప్పకూలిపోయి మృతి చెందారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. పూతలపట్టు మండలంలోని ఓ ప్రైవేటు పాల డెయిరీకి సంబంధించిన లారీకి తమిళనాడు రాష్ట్రం తిరువరం జిల్లా మైలాడవరానికి చెందిన మదిఆలగన్‌ (52) డ్రైవర్‌ గా పనిచేస్తున్నారు. డెయిరీ వద్దకు లారీని తీసుకెళుతుండగా మార్గంమధ్యలో పూతలపట్టు పోలీస్‌ స్టేషన్‌ సమీపంలోకి రాగానే వాహనాన్ని ఆపి వేసి సమీపంలోని ప్రైవేటు క్లినిక్‌ వద్దకు వెళ్లి అక్కడే కుప్పకూలిపోయాడు. వెంటనే ఆర్‌ఎంపీ వైద్యుడు ప్రాథమిక చికిత్సకు ప్రయత్నించగా మృతి చెందారని నిర్ధారించి, పోలీసులకు సమాచారం అందజేశారు. పోలీసులు పోస్టుమార్టం కోసం చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా రెండు రోజులుగా జ్వరం ఉందని, ఆస్పత్రిలో చూపించుకుని ఇంటికొస్తానని కుటుంబసభ్యులకు చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు 
1
1/1

చెట్టును ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. డ్రైవర్‌కు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement