సీతారాముల కల్యాణ వైభోగమే!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): వీధంతా పందిరి.. మదినిండా భక్తి...జనకరాజ పుత్రిక జానకీదేవికి దశరథ సుతుడు శ్రీరామచంద్రుడి కల్యాణం సోమ వారం కనులపండువగా సాగింది. చిత్తూరు నగరంలోని శ్రీకోదండరామస్వామి ఆలయంలో సోమవా రం సీతారాముల కల్యాణం వైభవంగా సాగింది. ఉదయం అష్టోత్తర శతకలశ, మహా తిరుమంజనంను నిర్వహించారు. అభిషేక పూజలతో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. సాయంత్రం ప్రత్యేక కల్యాణ వేదికను తీర్చిదిద్దారు. ఉభయదారులు సీతారాముల కల్యాణ వైభోగానికి పట్టు వస్త్రాలు సమర్పించారు. తర్వాత సీతారాముల వారిని అందంగా అలంకరించి కల్యాణ వేదికపై కొలువుదీర్చా రు. వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య కల్యాణఘట్టం ప్రారంభించారు. సుముహుర్తాన మాంగల్య ధారణ గావించారు. మహా మంగళ హారతితో కల్యాణమహోత్సవాన్ని ముగించారు. రెండు గంటలకు పాటు సాగిన ఉత్సవంలో భక్తులు రామనామస్మరణ చేస్తూ తన్మయత్వం పొందారు. రాత్రి పుష్పపల్లకి సేవలో స్వామి వారు విహరిస్తూ భక్తులకు కనువిందు చేశారు.


