పుత్తూరు: మామిడి రైతులు నిర్ణీత సమయాల్లో తప్పనిసరిగా సస్యరక్షణ చేపట్టాలని జిల్లా ఉద్యానవన అధికారి దశరథరామిరెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక మార్కెట్‌యార్డ్‌లో ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో మామిడి రైతులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఉద్యానవన శాఖ వారి ఆధ్వర్యంలో పండ్లకు చుట్టే కవర్లు 50 శాతం రాయితీతో అందుబాటులో ఉన్నాయని తెలిపారు. కవర్లు చుట్టడంతో కాయల నాణ్యత పెరుగుతుందన్నారు. కవర్లు కావల్సినవారు పట్టాపాస్‌బుక్, ఆధార్, బ్యాంకు పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు తీసుకువచ్చి రైతు సేవా కేంద్రాల వద్ద దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఉద్యాన శాస్త్రవేత్త డాక్టర్ రన్‌జిత్ మాట్లాడుతూ మామిడి సస్యరక్షణ, ఫల సంరక్షణ, మార్కెటింగ్ విషయాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మునివేలు, డ్రిప్ పీడీ సతీష్, పుత్తూరు ఏడీఏ రమేష్‌రాజు, ఏఓ కోదండయ్య, హార్టికల్చ్‌ర్ ఆఫీసర్ వెంకటసౌజన్య, రైతులు పాల్గొన్నారు.


