‘ఆరణి’ అక్రమాలు..! | Sakshi
Sakshi News home page

‘ఆరణి’ అక్రమాలు..!

Published Tue, Apr 23 2024 8:30 AM

- - Sakshi

చిత్తూరు అర్బన్‌ : ప్రజలకు చిత్తశుద్ధితో సేవ చేయాల్సిన పదవిని ‘ఆరణి’ తన స్వార్థానికి వినియోగించుకున్నారు. వందల ఎకరాల ప్రభుత్వ భూమిని చెరపట్టారు. ఆయన అడుగు జాడల్లోనే వారి అన్న కుమారుడు సైతం భూ దందాలు చేస్తూ రూ.కోట్లకు పడగెత్తాడు. వీరి ఆగడాలను అడ్డుకోవడం ఎవరి తరం కాలేదు. చిత్తూరు ‘శ్రీనివాసుడి’ అక్రమాలు ఓవైపు .. అబ్బాయ్‌ క్రిమినల్‌ ఆలోచనలు చూసి ప్రజలు ‘శివ’ శివా..! అనుకుంటున్నారు. వీళ్లకు ప్రభుత్వ భూములా...? ప్రైవేటు భూములా అనే తేడాలేదు. తమకు నచ్చిదంటే కబ్జాచేసి కంచెలు వేసేస్తారు. చిత్తూరు బాబాయ్‌ ‘ఆరణి’.. అబ్బాయ్‌ ‘శివ’ అవినీతి పర్వంలో కొన్ని..

ఫోర్జరీ మాయలు..!

● కరోనా సమయంలో చిత్తూరు మార్కెట్‌గేటు తన బినామీల పేరిట సొంతం చేసుకున్న ‘ఆరణి’.. చిన్నా,చితకా వ్యాపారుల ముక్కుపిండి రూ.కోట్లు వసూలు చేశారు. అయినప్పటికీ కరోనా సమయంలో తాము ఆశించిన నగదు వసూలు కాలేదని, ఈ మొత్తాన్ని మాఫీ చేయాలని అధికారులను అడ్డుపెట్టుకుని కౌన్సిల్‌లో తీర్మానం చేయించారు. ఫలితంగా కార్పొరేషన్‌ ఖజానాకు రూ.52 లక్షల నష్టం వాటిల్లింది.

● బూత్‌బంగ్లాను తలపించే శ్రీఆరణిశ్రీ ఇంట్లో, తన కంపెనీల్లో పనిచేయడానికి కొత్త స్కెచ్‌ వేశారు. తమ వద్ద పనిచేసే 27 మందిని మున్సిపల్‌ కార్పొరేషన్‌లో అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులుగా చేర్పించారు. సొంత పనులకు వీళ్లను వాడుకుని, కార్పొరేషన్‌ నుంచి నెలకు రూ.18 వేల చొప్పున వేతనాలు ఇచ్చేలా చక్రం తిప్పారు. ఇలా 27 మందికి 58 నెలల పాటు రూ.2.81 కోట్లను వేతనాల రూపంలో కొల్లగొట్టారు.

● ఇక 2017లో బెంగళూరు గ్రేటర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో ఓ టెండర్‌లో పాల్గొనేందుకు ‘ఆరణి’ కంపెనీకి ఏదైనా కార్పొరేషన్‌లో రూ.వంద కోట్లకు పనులు చేసినట్లు ద్రువీకరణ పత్రం కావాల్సి వచ్చింది. దీనికోసం చిత్తూరులోని ఇరువారం నుంచి గంగినేనిచెరువు వరకు కాలువ పనులు, చెరువుకట్టపై అభివృద్ధి పనులను చేసినట్లు ఓ సర్టిఫికెట్‌ను బెంగళూరు మహానగర పాలక (బీబీఎంపీ) అధికారులకు అందజేశారు. రూ.280 కోట్ల విలువైన ఈ పనుల్లో తాము తొలివిడతగా రూ.19.35 కోట్ల పనులు పూర్తి చేసినట్లు, దీనికి చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ బిల్లులు కూడా ఇచ్చేసిందని అందులో పేర్కొన్నారు. చిత్తూరు మున్సిపల్‌ కమిషనర్‌, ఇంజినీర్‌, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌, అసిస్టెంట్‌ ఇంజనీర్‌ సంతకాలను ఫోర్జరీ చేసి బీబీఎంపీ టెండర్లలో పాల్గొన్నారు. బెంగళూరు అధికారులకు అనుమానం వచ్చి, దీనిపై చిత్తూరు మున్సిపల్‌ అధికారులకు లేఖ రాశారు. దీన్ని శ్రీఆరణిశ్రీ తొక్కిపెట్టడంతో ఏకంగా బీబీఎంపీ అధికారులు చిత్తూరు కార్పొరేషన్‌ కార్యాలయానికి నేరుగా వచ్చి ఇక్కడి అధికారులను సంప్రదించారు. ధ్రువీకరణ పత్రంలోని సంతకాలు తమవి కాదని, అవి ఫోర్జరీ సంతకాలని తేల్చిచెప్పారు. దీంతో ‘ఆరణి’ కంపెనీపై బీబీఎంపీ అనర్హత వేటువేసింది. అయితే ఇది ఎవరి కంటాపడకుండా ‘ఆరణి’ వాస్తవాలను తొక్కపెట్టేశారు. ఇన్నాళ్లకు పాపం పండడంతో నిజం వెలుగుచూసింది.

● చిత్తూరు మండలంలో ‘ఆరణి’ చేసిన ఇసుక దందా అంతా ఇంతాకాదు. తన కంపెనీకు చెందిన భారీ యంత్రాలతో యథేచ్ఛగా ఇసుకను తవ్వేసి ఇతర ప్రాంతాలకు తరలించి అమ్మేశారు. ఇలా మూడేళ్ల పాటు సుమారు రూ.3.24 కోట్ల విలువైన ఇసుక అక్రమాలకు పాల్పడ్డారు.

భూ బకాసురుడు..!

చిత్తూరులో ఆరణి చేసిన భూ దందాలనే ఆదర్శంగా తీసుకున్న శివ అక్రమాలకు అడ్డూ అదుపులేకుండా పోయింది. చిత్తూరు భూ బకాసురుడిగా పేరుతెచ్చుకున్న తన బాబాయ్‌ ‘ఆరణి’ చేసిన అక్రమాల్లో శివ తనవంతు పాత్రను పోషించాడు.

గుడిపాల మండలంలోని పానాటూరు వద్ద 22 ఎకరాల ప్రభుత్వ భూమిని తన బంధువుల పేరిట పట్టా ఇప్పించుకున్నాడు. దీనికి ప్రస్తుతం గేటు ఏర్పాటుచేసి పంటలు పండిస్తున్నారు.

చిత్తూరు–బెంగళూరు బైపాస్‌ రోడ్డులో సీతమ్స్‌ కళాశాల సమీపంలో 74–తిమ్మసముద్రం రెవెన్యూ భూముల వద్ద ఓ అనామకుడి నుంచి రూ.కోటి విలువ చేసే భూములను బలవంతంగా లాక్కున్నారు. అసలు పట్టాదారులపై దౌర్జన్యం చేసి మరీ 2,800 అడుగుల భూమిని కబ్జా చేశారు. భూమికి సొంతవాళ్లు ఏర్పాటు చేసుకున్న ఫెన్సింగ్‌ను తొలగించి కొత్తగా కూసాలను నాటించేశారు.

చిత్తూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ కార్యాలయాన్ని తన అడ్డాగా మార్చుకున్న ‘ఆరణి’ అన్నకొడుకు.. ఉద్యోగుల సంఘ గౌరవాధ్యక్షుడిగా తనుకు తానే ఓ పదవిని సృష్టించుకున్నాడు. పట్టణ ప్రణాళిక విభాగం నుంచి రూ.5 లక్షలు, రెవెన్యూ విభాగం నుంచి రూ.2 లక్షలు, ప్రజారోగ్య విభాగం నుంచి రూ.50 వేలు చొప్పున ప్రతీ నెలా మున్సిపల్‌ అధికారుల నుంచి మామూళ్లను ముక్కుపిండి మరీ వసూలు చేశాడు.

ఇన్ని అక్రమాలుచేసిన ‘ఆరణి’ తన అన్నకొడుకుతో కలిసి తిరుపతికి మకాం మార్చారు. ప్రస్తుతం ఎన్నికల్లో పోటీచేస్తున్న ‘ఆరణి’ గురించి నిజాలు తెలిసిన తిరుపతి వాసులు ఆందోళన చెందుతున్నారు. ఇంతటి ఘనుడిని అందలం ఎక్కిస్తే తిరుమల శ్రీనివాసుడికే నామాలు పెట్టడం ఖాయమని భయపడుతున్నట్లు సమాచారం.

అవినీతిలో బాబాయ్‌.. అబ్బాయ్‌ పోటాపోటీ

ఇసుక దందాలో రూ.3 కోట్లకు పైగా స్వాహా

తమ సిబ్బందికి సైతం ప్రభుత్వ ఖజానా నుంచి రూ.2.81 కోట్ల వేతనాలు

కోవిడ్‌ కాలంలో మార్కెట్‌ గేటుకు రూ.52లక్షల ఎగవేత

పోర్టరజీ సంతకాలతో టెండర్ల భాగోతం

చిత్తూరును సాంతం దిగమింగి.. తిరుపతికి పాకిన అనకొండలు

ప్రజాధనానికి జవాబుదారీగా వ్యవహరించాల్సిన ఎమ్మెల్యే అయినప్పటికీ ఎక్కడ అవకాశముంటే అక్కడ అవినీతికి తెరతీసేస్తారు.. కంచే చేను మేసినట్టు ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తారు.. అధికారుల సంతకాలను పోర్జరీ చేసి ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టేస్తారు.. బాబాయ్‌ పదవిని అడ్డుపెట్టుకుని అబ్బాయ్‌ అక్రమాలకు పాల్పడతారు.. అన్న కుమారుడి క్రిమినల్‌ ఆలోచనలను సదరు ప్రజాప్రతినిధి తూచా తప్పకుండా అమలు చేసేస్తారు.. జేబులోని రూపాయి తీయరు.. యథేచ్ఛగా ఊరి మీద పడి దోచుకున్నారు.. ఎమ్మెల్యేగా నియోజకవర్గ అభివృద్ధిని

గాలికి వదిలేశారు.. చివరకు చిత్తూరును

సాంతం దిగమింగేశారు.. తమ అక్రమా

ర్జనను కొనసాగించేందుకు కొత్తగా తిరుపతిని

ఎంచుకున్నారు. దీంతో తిరునగరి వాసులు అప్రమత్తంగా ఉండాలని బాధితులు

హెచ్చరిస్తున్నారు.

చిత్తూరు మునినిసిపల్‌ కమిషనర్‌తో పాటు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ‘ఆరణి’
1/1

చిత్తూరు మునినిసిపల్‌ కమిషనర్‌తో పాటు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ‘ఆరణి’

Advertisement
 
Advertisement
 
Advertisement