ఎన్నికల ముందు హామీల వరద.. అధికారంలోకి వచ్చాక ఆ హామీలను మాఫీ చేయడంలో దిట్టగా పేరు గడించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తాజాగా ఇచ్చిన సూపర్‌సిక్స్ హామీలను కుప్పం జనం కూడా పట్టించుకోవడం లేదు. ఇదే విషయాన్ని కుప్పం నియోజకవర్గ టీడీపీ బాధ్యతలు చూస్తున్న ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ స్వయంగా చెప్పారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సమావేశంలో కంచర్ల మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. శ్రీమీటింగుల్లో ఎన్నిసార్లు చెప్పినా.. బాబు ష్యూరిటీ– భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం 88 శాతం పూర్తి చేసినాం.. ఇంకా కూడా మన పథకాలు జనం మైండ్‌లో రిజిస్టర్ కాలేదంటే లోపం ఎక్కడుంది? జనానికి పాంప్లెట్ ఇచ్చేసి ‘‘చంద్రబాబు.. అధిష్టానం.. డడడా’’అని నమస్కారం పెట్టి పరిగెత్తడం కాదు.. మొన్న శ్రీకాళహస్తిలో సార్ (చంద్రబాబు)ను కలిసినప్పుడు నాకు చెప్పింది ఇదే అని కంచర్ల శ్రీకాంత్ మాట్లాడిన వీడియో సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు స్పందిస్తున్నారు. రోజూ అబద్ధాలు చెప్పేవారిని జనం ఎక్కువ రోజులు నమ్మరని కామెంట్ చేస్తున్నారు. చంద్రబాబును, ఆయన మాటలను నమ్మేకాలం పోయిందని సూటిగా తమ అభిప్రాయాలు చెబుతున్నారు. ఇక కుప్పంలో బాబు కథ ముగిసిందని కొందరు స్పష్టం చేశారు.
– శాంతిపురం