
ఎన్నికలు సమీపించే కొద్దీ చంద్రబాబు వెన్నులో వణుకు మొదలైంది. పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నా లోలోపల భయపడుతున్నారని టీడీపీ సర్కిల్‌లో చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే తనపై, ఆశావహులపై రోజుకొక సర్వే చేయించుకుంటున్నారు. ఆ సర్వేలో అభ్యర్థుల గురించి స్థానికులు వ్యతిరేకంగా సమాధానాలు ఇస్తుండడంతో తీవ్రంగా అంతర్మథనం చెందుతున్నారు. ఇక పొత్తులో భాగంగా తమకు సీట్లు దక్కుతాయో లేదోనని పలువురు ఆశావహులు ఆందోళన పడుతున్నారు.
నేను మీ చంద్రబాబుని మాట్లాడుతున్నాను. మీ అసెంబ్లీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది? ఏ అయితే ఒకటి నొక్కండి. బీ అయితే రెండు నొక్కండి. నోటాకై తే మూడు నొక్కండి. (చంద్రబాబు వాయిస్‌తో మొబైల్ ఫోన్లకు వస్తున్న రికార్డు వాయిస్ ఇది)
సాక్షి, తిరుపతి: చంద్రబాబు కొద్ది రోజులుగా ఫోన్ ద్వారా సర్వే చేయించుకుంటున్నారు. ఆ సర్వేల్లో తనకు, తన పార్టీకి వ్యతిరేకంగా చెబుతుండడంతో మరుసటి రోజు వేరొక అభ్యర్థి పేరుతో సర్వే చేయిస్తున్నారు. చంద్రబాబు చేపడుతున్న ఈ సర్వేపై ఆశావహుల్లో ఆందోళన నెలకొంది. సర్వేలతో ఫలితాలు మారుతాయా? చెప్పే మాట, చేసే అభివృద్ధి పనులు సక్రమంగా చేసి ఉంటే.. ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదా..? అని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు తీరుతో టికెట్ ఎవరికి ఇస్తారనే విషయం ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశాలు లేవని కుంగిపోతున్నారు.
తిరుపతిలో మాకు పరపతి ఏది?
తిరుపతి అసెంబ్లీ అభ్యర్థిత్వం కోసం నాలుగు పేర్లతో సర్వే నిర్వహించారు. అందులో కేవలం ఒకే సామాజిక వర్గానికి చెందిన వారి పేర్లతో మాత్రమే సర్వే నిర్వహించడంపై యాదవ సంఘం నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చంద్రబాబు తీరుని టీడీపీ నేతలు బహిరంగంగానే ఎండగట్టారు. చట్టసభల్లో తమ సామాజికవర్గం వారిని పంపించే ఉద్దేశం లేదా? మేమేం పాపం చేశాం? సర్వే జాబితాల్లో కూడా అర్హత లేదా? అంటూ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. ఈ సారి తమవర్గం వారికి ఇవ్వాలని కమ్మ సామాజిక వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నారు.
పొత్తు భయం
చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఆశావహుల్లో గుబులుపుట్టిస్తోంది. పార్టీని నమ్ముకుని ఇన్నాళ్లు ఉన్న తమని కాదని వేరొక పార్టీకి అప్పగిస్తే తమ గతేంటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. పొరబాటున బీజేపీతో పొత్తు ఖరారైతే.. తిరుపతి పార్లమెంట్‌తో పాటు శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుందని టీడీపీ నేతలు భయపడుతున్నారు. అవే కాకుండా తిరుపతి, సూళ్లూరుపేట లేదా గూడూరు అసెంబ్లీ స్థానాల్లో ఏదో ఒకటి అడిగే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే జనసేన, బీజేపీ పంచుకోగా మిగిలినవి ఎన్ని? అని టీడీపీ నేతలు లెక్కలేసుకుంటున్నారు. ఓటమి భయంతో చంద్రబాబు మరింత దిగజారి పార్టీని నమ్ముకున్న నాయకులకు తీరని అన్యాయం చేస్తున్నారని మండిపడుతున్నారు. చంద్రబాబుకి తనపై తనకు నమ్మకం లేకపోవడంతోనే పార్టీకి సేవలందించిన నేతలు నష్టపోవాల్సి వస్తోందని తమ్ముళ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సారి కూడా పాయే!
శ్రీకాళహస్తి విషయానికి వస్తే.. సర్వేలో బొజ్జల సుధీర్‌రెడ్డికి బదులు భార్య బొజ్జల రిషితారెడ్డి పేరుని తెరపైకి తీసుకొచ్చారు. మిగిలిన వారెవ్వరి పేర్లు ప్రస్థావనకు తీసుకురాలేదు. దీన్ని బట్టిచూస్తే మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడిక్కూడా టికెట్ లేదని తేలిపోయింది. శ్రీకాళహస్తి టికెట్‌పై బోలెడు ఆశలు పెట్టుకున్న కమ్మ సామాజికవర్గం నేతలకు ఈ సారి కూడా మొండి చేయి ఇవ్వనున్నట్లు స్పష్టమైంది. పలమనేరులో మాజీ మంత్రి అమరనాథరెడ్డికి వ్యతిరేకంగా ఫలితాలు వెలువడడంతో బాబు పక్క చూపులు చూస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇకపోతే పుంగనూరు, చిత్తూరు, పూతలపట్టు, గంగాధరనెల్లూరు, సత్యవేడు, నగరి, గూడూరు, సూళ్లూరుపేట, వెంకటగిరి అసెంబ్లీ అభ్యర్థుల ఎంపిక విషయంలోనూ చంద్రబాబు తడబడుతున్నట్లు తెలిసింది. ముందుగా అనుకున్న అభ్యర్థులకు వ్యతిరేకంగా ఫలితాలు రావడంతో పలువురి పేర్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.