
జెప్టో కేఫ్‌ల కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నారని, స్టోర్స్ మూసివేస్తున్నారని వస్తున్న వార్తలను క్విక్ కామర్స్ ప్లాట్‌ఫాం జెప్టో సహ–వ్యవస్థాపకులు, సీఈవో ఆదిత్ పలిచా ఖండించారు. ఓ పోటీ సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (సీఎఫ్‌వో) కావాలనే తమపై బురద జల్లుతున్నారని, దుష్ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
నిరాధార ఆరోపణలతో ఇన్వెస్టర్లను తప్పుదోవ పట్టిస్తున్నారని, ఆర్థికాంశాలకు సంబంధించి జర్నలిస్టులకు తప్పుడు డేటా ఇస్తున్నారని, బాట్స్‌ను ఉపయోగించి సోషల్ మీడియాలో తమకు వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ సైట్ లింక్డ్‌ఇన్‌లో చేసిన పోస్టులో ఆదిత్ పలిచా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: హైదరాబాద్‌లో ఆఫీస్ అద్దెలు జంప్
‘గత కొద్ది రోజులుగా మా పోటీ సంస్థల్లో ఓ కంపెనీ సీఎఫ్‌వో జెప్టో మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది అలాంటి పెద్ద సంస్థ సీఎఫ్‌వో స్థాయికి తగని పని. మా జెప్టో ఎబిటా వేగంగా పెరుగుతుండటాన్ని చూసి వారిలో ఆందోళన మొదలైందని ఇది సూచిస్తోంది’ అని ఆదిత్ పేర్కొన్నారు. అయితే, సదరు సీఎఫ్‌వో పేరును ఆయన వెల్లడించలేదు. 2025 జనవరి–మే మధ్య కాలంలో తమ ఎబిటా 20 పర్సంటేజీ పాయింట్లు పెరిగిందని, వచ్చే క్వార్టర్ నాటికి చాలా మటుకు డార్క్ స్టోర్స్ స్థూల లాభాలను నమోదు చేసే అవకాశాలు ఉన్నాయని ఆదిత్ తెలిపారు. ప్రస్తుత క్వార్టర్ ప్రారంభం నాటికి జెప్టో వద్ద రూ.7,445 కోట్ల నగదు ఉందని, ప్రస్తుతం చేస్తున్న ఖర్చుల తీరుతెన్నులు బట్టి చూస్తే ఇది చాలా సంవత్సరాలకు సరిపోతుందని పేర్కొన్నారు.