
చదరపు అడుగుకు రూ.72
అత్యధికంగా ముంబైలో 28 శాతం పెరుగుదల
అనరాక్ నివేదిక వెల్లడి
హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్లో అద్దె ఆదాయం గత మూడేళ్లలో 24 శాతం పెరిగినట్టు రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ వెల్లడించింది. చదరపు అడుగు నెలవారీ అద్దె ధర 2022లో రూ.58గా ఉంటే.. అది 2025 నాటికి రూ.72కు పెరిగింది. అత్యధికంగా ముంబై మెట్రోపాలిటన్ రీజియన్‌లో (ఎంఎంఆర్) చదరపు అడుగుకు అద్దె రూ.131 నుంచి రూ.168కి చేరింది. 2022 నుంచి 2025 మధ్య కాలంలో (కరోనా అనంతరం) ప్రీమియం ఆఫీసు వసతులకు డిమాండ్ స్థిరంగా వృద్ధి చెందినట్టు.. ముఖ్యంగా ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, హైదరాబాద్ కీలక కేంద్రాలుగా ఉన్నట్టు అనరాక్ నివేదిక తెలిపింది. అన్ని మెట్రోల్లోనూ అద్దె ధరల్లో మంచి వృద్ది నమోదైనట్టు పేర్కొంది.
ఢిల్లీ ఎన్‌సీఆర్‌లో ఆఫీస్ వసతుల అద్దె చదరపు అడుగునకు రూ.92 నుంచి రూ.110కి పెరిగింది. 20 శాతం వృద్ధి నమోదైంది.
బెంగళూరులో నెలవారీ అద్దె చదరపు అడుగునకు రూ.16% పెరిగి రూ.82 నుంచి రూ.95కి చేరింది.
పుణెలో 11 శాతం పెరుగుదలతో రూ.80కి, చెన్నైలో 9.1 శాతం పెరిగి రూ.72కు చదరపు అడుగు అద్దె చేరుకుంది.
ఇదీ చదవండి: పీసీలకు పెరిగిన గిరాకీ
యూఎస్ కంపెనీల నుంచి అధిక డిమాండ్
గ్రేడ్ ఏ ఆఫీస్ లీజింగ్‌లో 45 శాతం యూఎస్ కంపెనీల నుంచే ఉన్నట్టు అనరాక్ గ్రూప్ కమర్షియల్ లీజింగ్ ఎండీ పీయూష్ జైన్ తెలిపారు. ముంబైలో బీఎఫ్‌ఎస్‌ఐ ఆఫీస్ లీజింగ్‌లో 48 శాతం యూఎస్‌కు చెందిన బ్యాంక్‌లు లీజింగ్‌కు తీసుకున్నట్టు చెప్పారు. భారత్‌లో గ్రేడ్ ఏ ఆఫీస్ వసతులకు అమెరికన్ కంపెనీల నుంచి బలమైన డిమాండ్ ఉన్నట్టు తెలిపారు.