
ఫోన్ పే, పేటిఎం లేదా క్రెడ్ వంటి మొబైల్ యాప్‌లలో క్రెడిట్ కార్డు ద్వారా ప్రతి నెలా రెంటు చెల్లించేవారికి ఇకపై కష్టతరం కానుంది. అనేక ఫిన్ టెక్ ప్లాట్‌ఫామ్ లు ఇప్పుడు తమ రెంటు పేమెంట్ సేవలను నిలిపివేశాయి. ఇటీవలి కాలంలో క్రెడిట్ కార్డు ద్వారా అద్దె చెల్లించడం ఒక ప్రసిద్ధ ధోరణిగా మారింది. ఎందుకంటే ఈ చెల్లింపులపై వినియోగదారులకు రివార్డ్ పాయింట్లతోపాటు వడ్డీ లేని క్రెడిట్ వ్యవధిని ఆస్వాదించే అవకాశం కలిగేది. అయితే ఆర్బీఐ తాజా నిబంధనలను అనుసరించి ఈ సౌలభ్యం ఇప్పుడు కనుమరుగవుతోంది.
చెల్లింపు సేవలపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సెప్టెంబర్ 15న ఒక సర్క్యులర్ జారీ చేసింది. ఈ చర్య ముఖ్యంగా క్రెడిట్ కార్డ్ రివార్డులను సంపాదించడానికి లేదా వారి ఆర్థిక వ్యవహారాలను నిర్వహించడానికి రెంటు చెల్లింపులపై ఆధారపడిన వ్యక్తులను ప్రభావితం చేస్తుంది. వారు ఇప్పుడు ప్రత్యక్ష బ్యాంకు బదిలీలు లేదా చెక్కు చెల్లింపులు వంటి సాంప్రదాయ పద్ధతులకు తిరిగి రావాల్సి ఉంటుంది.
ఆర్బీఐ కొత్త నిబంధనలు
సవరించిన మార్గదర్శకాల ప్రకారం.. తమతో ప్రత్యక్ష ఒప్పందాలను కలిగి ఉన్న, పూర్తి కేవైసీ ప్రక్రియను పూర్తి చేసిన వ్యాపారుల లావాదేవీలను మాత్రమే ప్రాసెస్ చేయడానికి పేమెంట్ అగ్రిగేటర్లు (PA), పేమెంట్ గేట్ వేలకు అనుమతి ఉంటుంది. తత్ఫలితంగా, ఈ యాప్‌లు ఇకపై తమ ప్లాట్ ఫామ్ లలో అధికారిక వ్యాపారులుగా నమోదు కాని భూస్వాములకు అద్దె చెల్లింపులను సులభతరం చేయలేవు.
ఆర్బీఐ ఇటీవలి చర్యకు ముందే బ్యాంకులు ఇలాంటి లావాదేవీలను పరిమితం చేయడానికి చర్యలు తీసుకుంటున్నాయి. ఉదాహరణకు, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, జూన్ 2024 నాటికే క్రెడిట్ కార్డు ద్వారా చేసే అద్దె చెల్లింపులపై 1% వరకు రుసుమును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంక్, ఎస్బీఐ కార్డులు కూడా ఈ చెల్లింపులపై రివార్డ్ పాయింట్లను అందించడం నిలిపివేశాయి. ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పేతో సహా అనేక ప్లాట్ ఫామ్ లు మార్చి 2024 నాటికి ఈ సేవను నిలిపివేసినప్పటికీ తర్వాత పాక్షికంగా వెసులుబాటు కల్పిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు కేవైసీ ప్రక్రియను కఠినతరం చేయడంతో ఇకపై అనధికార రెంటు చెల్లింపులకు అవకాశం ఉండదు.