
భారతీయ రైల్వే ‘మేక్ ఇన్ ఇండియా’ చొరవతో దేశంలోని పలు మార్గాల్లో సెమీ-హై-స్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను అప్‌గ్రేడ్ చేస్తోన్న నేపథ్యంలో ఆర్థిక వెసులుబాటకు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఓ ప్రభుత్వ సంస్థకు అద్దె చెల్లిస్తుంది. ఇది కొంత ఆకస్తిగా అనిపించినా, రైల్వే మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నగదు అప్పుగా ఇచ్చిన ఐఆర్‌ఎఫ్‌సీ కంపెనీకి భారతీయ రైల్వే లీజు చెల్లింపులు చేస్తోంది. ఇది ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ నిధులను హరించకుండా రైల్వేను ఆధునీకరించడానికి వీలు కల్పిస్తుందని నమ్ముతోంది. ఇది భారతీయ రైల్వేలు, ఐఆర్ఎఫ్‌సీ రెండింటికీ మేలు చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
ఆర్థికంగా తోడ్పాటు..
భారతీయ రైల్వే రైళ్ల తయారీ మౌలిక సదుపాయాలకు అద్దె చెల్లించేందుకు ఇండియన్ రైల్వే ఫైనాన్స్ కార్పొరేషన్ (ఐఆర్ఎఫ్‌సీ) కీలకంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ యాజమాన్యంలోని ఐఆర్ఎఫ్‌సీ భారతీయ రైల్వేలకు ఆర్థికంగా తోడ్పాటును అందిస్తోంది. ఇది మార్కెట్‌లో బాండ్లు, డిబెంచర్లను జారీ చేయడం ద్వారా మూలధనాన్ని సేకరిస్తోంది. దాంతో భారతీయ రైల్వేలకు అవసరమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రోలింగ్ స్టాక్ (రైళ్లు, ఇంజిన్లు మొదలైనవి)లో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.
వాయిదాల్లో చెల్లింపులు..
ఈ ఆస్తులను పెద్దమొత్తంలో నేరుగా కొనుగోలు చేయడానికి బదులుగా రైళ్లు, ఇంజిన్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణానికి ఐఆర్ఎఫ్‌సీ బాండ్ల రూపంలో వచ్చిన నిధులతో నగదు సమకూరుస్తుంది. వీటిని ఏర్పాలు చేసి తిరిగి రైల్వేలకు లీజుకు ఇస్తోంది. ఉదాహరణకు.. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐపీఎఫ్)ను ఐఆర్‌ఎఫ్‌సీ భారతీయ రైల్వేలకు లీజుకు ఇచ్చింది. ఇండియన్ రైల్వే ఐఆర్ఎఫ్‌సీకి చేసే లీజు చెల్లింపులను అద్దెగా పిలుస్తారు. వీటిని వాయిదాల్లో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో అసలు, వడ్డీ రెండూ ఉంటాయి.
ఈ మోడల్ ఎందుకు?
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ వంటి హైటెక్ రైళ్ల తయారీకి అయ్యే ఖర్చు అధికంగా ఉంటుంది. ఈ భారీ ఆర్థిక భారాన్ని ముందస్తుగా భరించడానికి బదులుగా భారతీయ రైల్వే కాలక్రమేణా ఖర్చును వైవిధ్య పరుస్తుంది. ఐఆర్‌ఎఫ్‌సీ బాండ్ల వేలం ద్వారా సమీకరించిన డబ్బు ద్వారా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఆ ఆస్తులను ఉపయోగిస్తూ, తర్వాతి కాలంలో అందుకు అద్దె చెల్లిస్తుంది. భారతీయ రైల్వే తక్షణ బడ్జెట్‌పై భారీ ఒత్తిడి లేకుండా కార్యాచరణ ఆదాయాలను (ప్రయాణీకుల టిక్కెట్లు, సరుకు రవాణా మొదలైన వాటి ద్వారా వచ్చే ఆదాయాలు) ఉపయోగించి క్రమంగా చెల్లింపులు చేస్తుంది. ప్రభుత్వ బడ్జెట్ పరిమితులకు లోబడి పనిచేసే భారతీయ రైల్వే వంటి ప్రభుత్వ రంగ సంస్థకు ఇది చాలా ముఖ్యమైనే అభిప్రాయాలున్నాయి.
ఇదీ చదవండి: భారత ఐటీ సర్వీసులపై యూఎస్ ‘హైర్’ బిల్లు ప్రతిపాదన