
భారతదేశం అందిస్తోన్న ఐటీ సేవల పరిశ్రమను దెబ్బ తీసేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవల ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ‘హైర్’ బిల్లు అందుకు నిదర్శనంగా నిలుస్తుంది. ఈ ప్రతిపాదిత బిల్లుకు అమెరికాలోని ప్రముఖ కంపెనీల నుంచే తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో భారత సంస్థలు ఎలాంటి విధానాలు పాటించాలో ఐటీ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. వాటి వివరాలు తెలుసుకుందాం.
హైర్ బిల్లు
గ్లోబల్ అవుట్ సోర్సింగ్‌లో ఆధిపత్యం చెలాయిస్తున్న ఇండియా వంటి దేశాలను లక్ష్యంగా చేసుకుని విదేశీ ఐటీ సర్వీసులపై 25% సుంకాన్ని హాల్ట్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయిమెంట్ (HIRE) బిల్లు ప్రతిపాదించింది. ఇది శాసనపరంగా విఫలమయ్యే అవకాశం ఉన్నప్పటికీ, రాజకీయ ఒత్తిడి మాత్రం పెరుగుతోంది. ముఖ్యంగా లారా లూమర్ వంటి వ్యక్తులు భారత కంపెనీలు అందించే కాల్ సెంటర్ సర్వీస్ ఉద్యోగాలను యూఎస్‌కు తిరిగి ఇవ్వాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే భారత్ దిగమతులపై 50 శాతం సుంకాలు విధించిన అమెరికాకు తలొగ్గని కేంద్ర ప్రభుత్వంపై ట్రంప్ మరోసారి సుంకాల మోత మోగించేందుకు ఇది తోడ్పడుతుంది. అయితే ఈ ప్రతిపాదనను అమెరికా కంపెనీలే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు అమల్లోకి వచ్చి భారత్ ఐటీ సర్వీసులపై ప్రభావం పడితే.. స్థానికంగా యూఎస్ తమ ఉద్యోగులకు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది. అదే భారత్‌లో అక్కడితో పోలిస్తే తక్కువ ఖర్చు అవుతుంది. దాంతో ఈ బిల్లుకు వ్యతిరేకత మొదలైంది.
ఎక్కువగా ఆధారపడటం..
హైర్ బిల్లు ప్రతిపాదనలో ఉన్న నేపథ్యంలో దేశీయ ఐటీ ఎగుమతులు ఆందోళన కలిగిస్తున్నాయి. భారత్ నుంచి 60% ఐటీ సర్వీసులు ఉత్తర అమెరికాకు వెళ్తున్నాయి. అందులో టీసీఎస్- 48.2%, ఇన్ఫోసిస్- 57.9%, విప్రో- సుమారు 60% ఎగుమతులు యూఎస్‌కు చేస్తున్నాయి. అతిగా అమెరికాపై ఆధారపడటంతో భారతదేశ ఐటీ రంగాన్ని యూఎస్ విధాన మార్పుల ద్వారా ప్రభావితం చేసే పరిస్థితులు నెలకొంటున్నాయి.
చేయాల్సింది ఇదే..
భారతదేశం అమెరికాపై ఆధారపడటాన్ని తగ్గించాలి. యూరప్, ఆగ్నేయాసియా, ఆఫ్రికాలో మరింత దూకుడుగా విస్తరించాలి. ఏఐ ఆధారిత వ్యవస్థలను నిర్వహించగల అత్యంత నైపుణ్యం కలిగిన నిపుణులపై దృష్టి పెట్టాలి. స్థానికంగా ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో పెట్టుబడి పెట్టాలి. వీటిని పెంచాలి. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఐటీ సేవలకు డిమాండ్ నెలకొంటుండడంతో వీటిపై మరింత దృష్టి సారించాలి.
ఇదీ చదవండి: పాత స్టాక్‌పై ఎంఆర్‌పీ మార్చవచ్చు: కేంద్రం