
రిపబ్లిక్ డే అమ్మకాలు, అధిక ఎగుమతులు కారణంగా భారత వ్యక్తిగత కంప్యూటర్‌ల (పీసీలు) మార్కెట్ 2025 మార్చి క్వార్టర్‌లో పరుగులు పెట్టింది. వార్షిక ప్రాతిపదికన 8.1% వృద్ధితో మొత్తం 33.17 లక్షల పీసీలు అమ్ముడైనట్లు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) నివేదిక తెలిపింది. అంతకుముందు 2024 ఇదే త్రైమాసికంలో మొత్తం విక్రయాలు 30.70 లక్షలుగా ఉన్నాయి.
‘ఆఫ్‌లైన్ విస్తరణపై దృష్టి, ఈ–టైలింగ్ చానెల్ కారణంగా భారత పీసీ మార్కెట్ వరుసగా ఏడో క్వార్టర్‌లోనూ వృద్ధి సాధించింది. పీసీ వెండర్లు కొత్త బ్రాండ్ స్టోర్ల ద్వారా కస్టమర్లకు వ్యక్తిగత కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురావడంతో ఆఫ్‌లైన్ విక్రయాలు పెరిగాయి. ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్ డీల్స్‌తో ఆన్‌లైన్ అమ్మకాలు ఊపందుకున్నాయి. బలమైన షిప్‌మెంట్ మార్కెట్ సానుకూల ధోరణి సూచిస్తున్నప్పట్టకీ.., సమీప భవిష్యత్తులో ఇన్వెంటరీ(నిల్వల) సవాళ్లు ఎదురవ్వొచ్చు’ అని ఐడీసీ ఇండియా రీసెర్చ్ మేనేజర్ భరత్ షెనాయ్ తెలిపారు.
ఇదీ చదవండి: గోల్డ్ రేట్, స్టాక్ మార్కెట్ అప్‌డేట్స్
మార్చి క్వార్టర్‌లో హెచ్‌పీ కంపెనీ 9.6 లక్షల యూనిట్లు విక్రయించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో అమ్మిన 9.2 లక్షల యూనిట్లతో పోలిస్తే ఇది 4.6% అధికం. అయితే పీసీ మార్కెట్లో 29.1% వాటాతో అగ్రస్థానాన్ని నిలుపుకుంది.
చైనా కంపెనీ లెనోవో విక్రయాలు 34.8% వృద్ధితో రికార్డు స్థాయిలో 6.26 లక్షల పీసీలు అమ్మింది. గతేడాది ఇదే కాలంలో అమ్మకాలు 4.64 లక్షలుగా ఉన్నాయి. మొత్తం 18.9 శాతం వాటాతో రెండోస్థానాన్ని దక్కించుకుంది.
అమెరికా కంపెనీ డెల్ టెక్నాలజీస్ అమ్మకాలు 3.4% క్షీణించాయి. అమ్మకాలు 5.37 లక్షల నుంచి 5.18 లక్షలకు పరిమితమయ్యాయి. పీసీ విభాగంలో 15.6% వాటాతో మూడోస్థానంలో ఉంది.
ఏసర్ అమ్మకాల్లో 7.6%, ఆసుస్ విక్రయాల్లో 8.6% వృద్ధి నమోదైంది. మొత్తం మార్కెట్ వాటాల్లో ఏసర్ (15.4%) నాలుగో స్థానంలో, ఆసుస్(6%) అయిదో స్థానాల్లో కొనసాగుతున్నాయి.
వ్యక్తిగత కంపూటర్ల విభాగంలో భాగమైన నోట్స్‌బుక్స్ విక్రయాల్లో 13.8%, వర్క్‌స్టేషన్ల అమ్మకాల్లో 30.4%, ప్రీమియం నోట్‌బుక్ షిప్‌మెంట్స్ 8% వృద్ధి నమోదైంది. అయితే డెస్క్‌టాప్ అమ్మకాలు స్వల్పంగా 2.4% క్షీణత చవిచూశాయి.