
న్యూఢిల్లీ: జీ మీడియా కార్పొరేషన్ లిమిటెడ్ నష్టం మార్చి త్రైమాసికంలో మరింత పెరిగిపోయింది. రూ.37 కోట్ల నష్టాన్ని సంస్థ నమోదు చేసింది. క్రితం ఏడాది ఇదే కాలంలో నష్టం కేవలం రూ.6.51 కోట్లుగానే ఉంది. దీంతో పోల్చి చూస్తే ఆరు రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది.
ఆదాయం సైతం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 13 శాతం తగ్గి రూ.156 కోట్లుగా ఉంది. మొత్తం వ్యయాలు 6 శాతానికి పైగా పెరిగి రూ.200 కోట్లుగా ఉన్నాయి. మార్చి క్వార్టర్‌లో ప్రకటనల ఆదాయం 13.5 శాతం తక్కువగా రూ.145 కోట్లకు పరిమితమైంది.
సబ్‌స్క్రిప్షన్ ఆదాయం 6.9 శాతం తగ్గి రూ.10 కోట్లుగా ఉంది. ఇక 2024–25 పూర్తి ఆర్థిక సంవత్సరానికి జీ మీడియా కార్పొరేషన్ రూ.119 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో నష్టం రూ.98 కోట్లుగానే ఉంది. కన్సాలిడేటెడ్ ఆదాయం 4 శాతానికి పైగా తగ్గి రూ.633 కోట్లుగా ఉంది.