
ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకి పెరుగుతున్నాయి. ఇలాంటి మోసాల పట్ల జాగ్రత్త వహించాలని అధికారులు ఎంతచెప్పినా.. ప్రజలు మోసపోతున్నారు. ఇటీవల జపాన్‌కు చెందిన 80 ఏళ్ల మహిళ.. వ్యోమగామినని చెప్పుకుని పరిచయమైన మోసగాడి భారినపడి దాదాపు రూ. 6 లక్షలు పోగొట్టుకుంది.
జపాన్‌లోని ఉత్తరాన ఉన్న హక్కైడోకు చెందిన 80 ఏళ్ల మహిళ.. జూలైలో సోషల్ మీడియాలో తాను వ్యోమగామి అని చెప్పుకునే స్కామర్‌ను కలిసింది. కొంత సంభాషణ తరువాత.. తాను ప్రస్తుతం అంతరిక్ష నౌకలో.. అంతరిక్షంలో ఉన్నానని, ఆక్సిజన్ అవసరం ఉందని మహిళతో చెప్పాడు. ఆక్సిజన్ కొనడానికి డబ్బు కావాలని ఆమెను కోరాడు. ఒంటరిగా ఉన్న మహిళ ఆ మోసగాడిపై ప్రేమ పెంచుకుని.. 5000 పౌండ్లు (సుమారు రూ.6 లక్షలు) డబ్బు పంపింది. చివరకు మోసపోయానని తెలుసుకుంది.
చివరికి చేసేదేమీ లేక పోలీసులను సంప్రదించింది. వారు దీనికి 'రొమాన్స్ స్కామ్' (అపరిచిత వ్యక్తులపై ప్రేమ పెంచుకోవడం) అని పేరుపెట్టారు. సోషల్ మీడియాలో మీకు పరిచయమైన వారు.. ఎవరైనా మీ నుంచి డబ్బు డిమాండ్ చేస్తే.. దయచేసి స్కామ్ జరిగే అవకాశం ఉందని తెలుసుకోండి. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయండి అని పోలీసు అధికారి హెచ్చరించారు.
ప్రపంచంలో ఎక్కువ జనాభా కలిగిన దేశాల జాబితాలో జపాన్ ఒకటి. దీంతో ఇక్కడ మోసాలు పెరుగుతున్నాయి. జపాన్ నేషనల్ పోలీసు ఏజెన్సీ ప్రకారం.. 2024 మొదటి 11 నెలల్లో 3,326 రొమాన్స్ స్కామ్‌లు నమోదయ్యాయి. ఈ కేసులు 2023తో పోలిస్తే రెట్టింపు కంటే ఎక్కువ.
గతంలో రొమాన్స్ స్కామ్‌లు
వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని.. ఇలాంటి రొమాన్స్ స్కామ్‌లు జరగడం ఇదే మొదటిసారి కాదు. ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఒక ఆస్ట్రేలియన్ మహిళ ఆన్‌లైన్ మోసగాళ్ల వలలో పడి రూ.4.3 కోట్లకు పైగా పోగొట్టుకుంది. డేటింగ్ యాప్‌లో పరిచయమైనా.. అపరిచితుడు మలేషియాలోని కౌలాలంపూర్‌లో తన పర్సు దొంగిలించబడినందున తనకు రూ.2,75,000 అవసరమని ఆమెకు చెప్పాడు. నిజమని నమ్మిన ఆ మహిళ డబ్బు పోగొట్టుకుంది.
ఇదీ చదవండి: భారత్‌పై ప్రశ్న.. చైనా రోబో సమాధానం