విప్రో 10,500 కోట్ల షాపింగ్‌! | Wipro to buy London tech consultancy firm Capco | Sakshi
Sakshi News home page

విప్రో 10,500 కోట్ల షాపింగ్‌!

Mar 5 2021 5:01 AM | Updated on Mar 5 2021 5:01 AM

Wipro to buy London tech consultancy firm Capco - Sakshi

న్యూఢిల్లీ: గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ టెక్నాలజీ కన్సల్టెన్సీ క్యాప్‌కోను కొనుగోలు చేయనున్నట్లు ఐటీ సర్వీసుల దేశీ దిగ్గజం విప్రో తాజాగా పేర్కొంది. ఇందుకు ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు తెలియజేసింది. క్యాప్‌కోను సొంతం చేసుకునేందుకు 1.45 బిలియన్‌ డాలర్లను(రూ. 10,500 కోట్లు) వెచ్చించనున్నట్లు వెల్లడించింది. విప్రో చరిత్రలోనే ఇది అతిపెద్ద కొనుగోలుకావడం గమనార్హం! క్యాప్‌కో కొను గోలుతో బ్యాంకింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసెస్, ఇన్సూరెన్స్‌(బీఎఫ్‌ఎస్‌ఐ) విభాగంలో కన్సల్టింగ్, ఐటీ సర్వీసులందించడంలో మరింత పటిష్టతను సంతరించుకోనున్నట్లు విప్రో వివరించింది. ఈ విభాగంలోని అంతర్జాతీయ క్లయింట్ల(సంస్థలు)కు పటిష్టమైన, సమర్ధవంత కన్సల్టింగ్, ఫైనాన్షియల్‌ సర్వీసులను అందించనున్నట్లు తెలియజేసింది. కంపెనీకిగల వ్యూహాత్మక డిజైన్, డొమైన్, డిజిటల్‌ ట్రాన్స్‌ఫార్మేషన్, క్లౌడ్‌ తదితర సేవలకు క్యాప్‌కోకున్న కన్సల్టింగ్‌ సమర్ధత జత కలవనున్నట్లు పేర్కొంది. వెరసి బ్యాంకింగ్‌ చెల్లింపులు, క్యాపిటల్‌ మార్కెట్లు, బీమా తదితర విభాగాలలో మరింత మెరుగైన సేవలకు వీలున్నట్లు తెలియజేసింది.

క్యాప్‌కో తీరిదీ...: 1998లో ఏర్పాటైన క్యాప్‌కో ప్రపంచవ్యాప్తంగా 100 మందికిపైగా క్లయింట్లను కలిగి ఉంది. అంతర్జాతీయంగా సుప్రసిద్ధ ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌కు దీర్ఘకాలంగా సేవలందిస్తోంది. లండన్‌ కేంద్రంగా 16 దేశాలలో 30 ప్రాంతాలలో కార్యకలాపాలు విస్తరించింది. 5,000 మంది కన్సల్టెంట్స్‌ ద్వారా సర్వీసులు అందిస్తోంది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన గత ఆర్థిక సంవత్సరం(2020)లో 72 కోట్ల డాలర్ల(సుమారు రూ. 5,200 కోట్లు) ఆదాయం సాధించింది. క్యాప్‌కోకున్న ప్రతిభావంత టీమ్, క్లయింట్లతోపాటు, సిబ్బందికి ఆహ్వానం పలికేందుకు ఆసక్తిగా ఉన్నట్లు విప్రో సీఈవో, ఎండీ థియరీ డెలాపోర్ట్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రెండు సంస్థల కలయికతో క్లయింట్లకు అత్యున్నత కన్సల్టింగ్, ట్రాన్స్‌ఫార్మేషన్స్‌ సేవలందించనున్నట్లు తెలియజేశారు. రెండు సంస్థల మధ్య ఒకేవిధమైన బిజినెస్‌ మోడల్స్, కీలక మార్గదర్శక విలువలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఇకపై విప్రో హోమ్‌ సిబ్బందిగా సేవలందించేందుకు క్యాప్‌కో ఉద్యోగులు గర్వపడతారని భావిస్తున్నట్లు చెప్పారు. రెండు సంస్థల కలయిక ద్వారా క్లయింట్లకు అవసరమయ్యే అత్యున్నత ట్రాన్స్‌ఫార్మేషనల్‌ ఎండ్‌ టు ఎండ్‌ సొల్యూషన్స్‌ లభించగలవని క్యాప్‌కో సీఈవో లాన్స్‌ లెవీ వ్యాఖ్యానించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement