యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే.. | Why Apple manufactures iPhones outside the US? | Sakshi
Sakshi News home page

యూఎస్‌లో ఐఫోన్లు ఎందుకు తయారు చేయరంటే..

Apr 13 2025 12:50 PM | Updated on Apr 13 2025 1:15 PM

Why Apple manufactures iPhones outside the US?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్థానికంగా తయారీని పునరుద్ధరించడానికి సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. చైనా వంటి దేశాల్లో భారీగా తయారవుతున్న యాపిల్‌ వంటి అమెరికన్‌ కంపెనీల ఉత్పత్తులపై ఈ ప్రభావం పడుతుందని మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. కంపెనీ కూడా చాలాకాలంగా ఈమేరకు సుంకాల నుంచి మినహాయింపు కావాలని యూఎన్‌ను కోరుతుంది. దాంతో అమెరికా ఇటీవల ఫోన్లు, కంప్యూటర్లను ప్రతీకార సుంకాల నుంచి మినహాయిస్తున్నట్లు ప్రకటించింది. అయితే అసలు యాపిల్‌ కంపెనీ తన ఉత్పత్తులను ఎందుకు యూఎస్‌లో తయారు చేయదో నిపుణులు విశ్లేషిస్తున్నారు.

అమెరికాలో ఐఫోన్ల తయారీ అంత సులభం కాకపోవచ్చనే అభిప్రాయాలున్నాయి. 2011 ఫిబ్రవరిలో కాలిఫోర్నియాలో జరిగిన ఓ ప్రైవేట్ సమావేశంలో అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, యాపిల్ సీఈఓ స్టీవ్ జాబ్స్ సహా సిలికాన్ వ్యాలీలోని అత్యంత ప్రభావవంతమైన నాయకులు పాల్గొన్నారు. అందులోని సారాంశాన్ని 2012లో న్యూయార్క్ టైమ్స్ హైలైట్ చేసింది. స్టీవ్ జాబ్స్ 2011 అక్టోబర్‌లో మరణించడానికంటే కొన్ని నెలల ముందు ఈ సమావేశం జరిగింది. అందులో స్టీవ్ జాబ్స్ మాట్లాడుతున్న సమయంలో అమెరికాలో ఐఫోన్లు తయారు చేయడానికి ఏమి కావాలని ఒబామా ఒక ప్రశ్న అడిగారు. దానికి స్పందించిన స్టీవ్‌జాబ్స్‌ నిర్మొహమాటంగా యాపిల్‌ తయారీకి యూఎస్‌ కంటే ఇతర దేశాలే అనుకూలంగా ఉన్నాయని తెలిపారు.

ఇదీ చదవండి: డజను మంది మాజీ ఉద్యోగులు న్యాయపోరాటం

యాపిల్ ఇతర దేశాల్లో ఉత్పత్తులను తయారు చేసేందుకు గల కొన్ని కారణాలను మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. చైనా వంటి దేశాలు దశాబ్దాలుగా అత్యంత ప్రత్యేకమైన తయారీ పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేశాయి. ఇందులో నైపుణ్యం కలిగిన కార్మికులు, మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశాయి. యూఎస్‌లో లేబర్‌, ఉత్పత్తి ఖర్చులు ఇతర దేశాలతో పోలిస్తే అధికంగా ఉంటాయి. అమెరికాలో ఐఫోన్లు తయారైతే వాటి ధర మూడింతలు అవుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. భారత్‌లో కూడా ఫాక్స్‌కాన్‌, టాటా ఎలక్ట్రానిక్స్‌ వంటి కంపెనీల ద్వారా యాపిల్‌ ఉత్పత్తులను తయారు చేస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement