Equity Fund Investments: రేటింగ్‌ తగ్గితే ఎలా? వారం/నెలవారీ సిప్‌ ఏది బెటర్‌?

 which sip plan is better in equity Fund Investments - Sakshi

రేటింగ్‌ తగ్గింది.. వైదొలగాలా?  

ప్రతి నెలా ఇన్వెస్ట్‌ చేస్తున్న ఓ మ్యూచువల్‌ ఫండ్‌ పథకం స్టార్‌ రేటింగ్‌ 4 ఉండేది కాస్తా, 3కు తగ్గింది. అందుకుని ఈ పెట్టుబడులను విక్రయించేసి, తిరిగి 4 స్టార్‌ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలని అనుకుంటున్నాను. అయితే ఈ మొత్తం ఒకే విడత చేయాలా..? లేక సిస్టమ్యాటిక్‌ విత్‌ డ్రాయల్‌ (ఎస్‌డబ్ల్యూపీ) రూపంలో చేసుకోవాలా?  – రాజ్‌దీప్‌ సింగ్‌ 
ముందుగా ఓ పథకం నుంచి వైదొలిగేందుకు స్టార్‌ రేటింగ్‌ను 4 నుంచి 3కు తగ్గించడం ఒకే కారణంగా ఉండకూడదు. 3 స్టార్‌ అంటే చెత్త పనితీరుకు నిదర్శనం కానే కాదు. ఎందుకంటే 3 స్టార్‌ రేటింగ్‌ కలిగిన చాలా పథకాలు ఆయా విభాగాల్లోని సగటు పనితీరుకు మించి రాబడులను ఇస్తున్నాయి. అందుకుని ముందు మ్యూచువల్‌ ఫండ్‌ పథకం నుంచి ఎందుకు వైదొలుగుతున్నదీ సూక్ష్మంగా విశ్లేషించుకోవాలన్నది నా సూచన. ఆ తర్వాతే ఒకే విడతగానా లేదంటే ఎస్‌డబ్ల్యూపీ రూపంలోనా అన్న అంశానికి రావాలి. ఒక్కసారి ఒక పథకంలో పెట్టుబడులు కొనసాగించకూడదని, వైదొలగాలని నిర్ణయించుకున్న తర్వాత ఇక ఎస్‌డబ్ల్యూపీ ఆలోచనే అక్కర్లేదు. కాకపోతే ఎగ్జిట్‌లోడ్, మూలధన లాభాల అంశాలను దృష్టిలో పెట్టుకుని సిస్టమ్యాటిక్‌గా వైదొలగాలా? లేదా? అన్నది నిర్ణయించుకోండి. రెండు మూడు విడతలుగా పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సరైనది. ముందుగా ఎగ్జిట్‌ లోడ్‌ లేని, దీర్ఘకాల మూలధన లాభం రూ.లక్ష వరకు పన్ను లేని మొత్తాన్ని వెనక్కి తీసుకోవచ్చు. ఈ విధంగా పన్ను ఆదా అవుతుంది.

సిప్‌ రూపంలోఈక్విటీ పథకంలో ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. ఇందుకు వారం/నెలవారీ సిప్‌లలో ఏది బెటర్‌? – అమర్‌ సహాని
వీక్లీ సిప్‌ను ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్‌మెంట్‌ను మరింత క్లిష్టం చేసుకోవడం ఎందుకు? అన్నది నా అభిప్రాయం. దీనివల్ల నెలలో నాలుగు సార్లు పెట్టుబడులు పెట్టుకున్నట్టు అవుతుంది. దీని కారణంగా మీ ఖాతాలో లావాదేవీల సంఖ్య చాంతాడంత ఉంటుంది. దీన్ని పరిశీలించుకోవడం కూడా ఇబ్బందికరమే. మూలధన లాభాల విషయాన్ని పరిశీలించినా లావాదేవీలు భిన్న ఎన్‌ఏవీలతో ఉంటాయి. తిరిగి వీటిని వెనక్కి తీసుకునే సమయంలో మూలధన లాభాల పన్ను లెక్కించడం కూడా క్లిష్టంగా మారుతుంది. తక్కువ మొత్తంతో ఎందుకు అంత తరచుగా సిప్‌ అమలు చేయాలి? అని ఒకసారి ప్రశ్నించుకోండి. దీనికి బదులు మేము అయితే నెలవారీ సిప్‌నే ఇన్వెస్టర్లకు సూచిస్తుంటాం. ఇన్వెస్టర్ల నగదు ప్రవాహ కాలాలకు (నెలవారీ ఆదాయం) అనుగుణంగా ఉంటుంది. మన ఆదాయం నెలవారీగా వస్తుంటుంది. అందుకనే నెలవారీగా ఇన్వెస్ట్‌ చేనుకోవడం సముచితం.  కనుక గతం నుంచి అమల్లో ఉన్న నెలవారీ సిప్‌కు వెళ్లమనే నా సూచన.

- ధీరేంద్ర కుమార్‌ (సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్‌)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top