ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ కోసం వేదాంత గ్రూపు భారీగా పెట్టుబడులు..!

Vedanta To Invest up to 20 bn Dollars in Electronic Chip Business in India - Sakshi

మన దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారు చేయడం కోసం వేదాంత గ్రూపు 15 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు తెలుస్తుంది. అలాగే, ఈ పెట్టుబడిని 20 బిలియన్ డాలర్లకు పెంచాలని యోచిస్తున్నట్లు కంపెనీ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వేదాంత గ్రూపుకు చెందిన అవన్ స్ట్రేట్ సంస్థ 2025 నాటికి భారతీయ తయారీ ప్లాంట్ల నుంచి ఎలక్ట్రానిక్ చిప్స్ & డిస్‌ప్లేలను విడుదల చేయాలని ఆశిస్తున్నట్లు ఒక అధికారి తెలిపారు.

"సెమీకండక్టర్ అనేది ఒక దీర్ఘకాలిక వ్యాపారం. మేము డిస్‌ప్లే తయారీ రంగంలో సుమారు 10 బిలియన్ డాలర్లను పెట్టుబడి పెట్టాలని చూస్తున్నాము. ప్రస్తుతం మేము ఈ సెమీకండక్టర్ రంగంలో 7 బిలియన్ డాలర్లను ఇన్వెస్ట్ చేయాలని చూస్తున్నాము, ఆ తర్వాత ప్లాంట్ విస్తరణలో భాగంగా ఈ పెట్టుబడి మరో 3 బిలియన్ డాలర్లు కూడా పెరగవచ్చు. మొదటి 10 సంవత్సరాల మేము 15 బిలియన్ డాలర్ల వరకు పెట్టుబడి పెట్టాలని అనుకుంటున్నాము. తదుపరి దశలో మరిన్ని పెట్టుబడులను పెడుతాము" అని అవన్ స్ట్రేట్ మేనేజింగ్ డైరెక్టర్ అకర్ష్ హెబ్బర్ చెప్పారు.

సెమీకండక్టర్ ప్లాంట్ & డిస్‌ప్లే తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి అవన్ స్ట్రేట్ ఇప్పటికే దరఖాస్తు చేసింది. భారతదేశంలో సెమీకండక్టర్ల తయారు కోసం జాయింట్ వెంచర్ కింద కంపెనీని ఏర్పాటు చేయడానికి వేదాంత గ్రూప్, ఎలక్ట్రానిక్స్ తయారీ దిగ్గజం ఫాక్స్‌కాన్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో ఎలక్ట్రానిక్ చిప్స్ తయారీ సంస్థలను ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం 10 బిలియన్ డాలర్ల(రూ.76,000 కోట్లు) పథకాన్ని ప్రకటించిన తర్వాత సెమీకండక్టర్ తయారీలో పెట్టుబడులు పెట్టడానికి సిద్దంగా ఉన్నట్లు ప్రకటించిన సంస్థలలో మొదటి సంస్థ వేదాంత గ్రూప్.

(చదవండి: ఎన్​ఎస్​ఈ కేసులో చిత్రా రామకృష్ణకు లుక్​ఔట్​ నోటీసులు..!)

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top