ఆంత్రోపిక్ సంస్థకు చెందిన శక్తివంతమైన ఏఐ మోడళ్లు ‘క్లాడ్ ఫేబుల్ 5’ (Claude Fable 5), ‘మైథోస్ 5’(Mythos 5)లపై విధించిన విదేశీ యాక్సెస్ ఆంక్షలను అమెరికా ఎత్తివేసింది. అమెరికా వాణిజ్య శాఖ తన నియంత్రణలను తొలగించినట్లు ధ్రువీకరించిన అనంతరం ఈ మోడళ్ల సేవలను పునరుద్ధరిస్తున్నట్లు ఆంత్రోపిక్ అధికారికంగా ప్రకటించింది. ‘మా వినియోగదారుల సహనానికి, అలాగే మోడళ్లను తిరిగి అందుబాటులోకి తీసుకురావడంలో సహకరించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు’ అని ఆంత్రోపిక్ సంస్థ ఎక్స్ వేదికగా పేర్కొంది.
భద్రతా హామీలతో లభించిన ఊరట
ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రసారమైన ఒక లేఖలో అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి హోవార్డ్ లుత్నిక్ ఈ నిర్ణయానికి గల కారణాలను స్పష్టం చేశారు. ఆంత్రోపిక్ సంస్థ ఇకపై ప్రత్యేక ఎగుమతి లైసెన్స్ పొందాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ఏఐ మోడళ్లతో ముడిపడి ఉన్న భద్రతా ప్రమాదాలను ముందస్తుగా గుర్తించి వాటిని పరిష్కరించేందుకు ఆంత్రోపిక్ అంగీకరించడమే ఇందుకు ప్రధాన కారణం. దీనితో పాటు, రాబోయే ఏఐ మోడళ్ల ప్రమాణాలపై ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి, ఎలాంటి హానికరమైన కార్యకలాపాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయడానికి సంస్థ అంగీకరించింది.
అసలేం జరిగింది? ఆంక్షల నేపథ్యం ఇదే..
గత నెలలో(జూన్) డొనాల్డ్ ట్రంప్ పరిపాలనా యంత్రాంగం ఆంత్రోపిక్ సంస్థకు ఊహించని షాక్ ఇచ్చింది. కంపెనీ ఉద్యోగులతో సహా విదేశీ పౌరులు ఎవరూ ఈ మోడళ్లను యాక్సెస్ చేయకుండా నిరోధించాలని ఆదేశించడంతో సంస్థ అకస్మాత్తుగా ఫేబుల్ 5, మైథోస్ 5 సేవలను నిలిపివేసింది. ఆ సమయంలో ప్రభుత్వం నిర్దిష్ట కారణాలేవీ చెప్పనప్పటికీ ఫేబుల్ 5లోని భద్రతా అంశాలపై అధికారులు ఆందోళన చెందడమే ఇందుకు కారణమని భావించారు.
అయితే, గత శుక్రవారం క్లిష్టమైన మౌలిక సదుపాయాలను నిర్వహించే అమెరికా సంస్థలకు మాత్రమే వీటిని ఉపయోగించేందుకు అనుమతి లభించింది. ఇప్పుడు తాజాగా సాధారణ ప్రజలకు కూడా పూర్తిస్థాయి యాక్సెస్ ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ట్రంప్ ప్రభుత్వం వర్సెస్ ఆంత్రోపిక్
ట్రంప్ పరిపాలనా యంత్రాంగానికి, ఆంత్రోపిక్ సంస్థకు మధ్య కొంతకాలంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ ఆంక్షలు ఆ ఉద్రిక్తతలకు మరింత ఆజ్యం పోశాయి. గత మార్చిలో ఆంత్రోపిక్ ఏఐ సంస్థ రక్షణ శాఖ (పెంటగాన్)పై దావా వేసింది. తమ ఏఐ సాధనాలను సామూహిక నిఘా లేదా స్వయంప్రతిపత్త ఆయుధాల కోసం ఉపయోగించబోమని స్పష్టమైన హామీలు ఇవ్వనందుకు పెంటగాన్ ఈ సంస్థను సప్లై చెయిన్ రిస్క్‌గా లేబుల్ చేసింది. దీనిపై సంస్థ న్యాయపోరాటానికి దిగింది.
మరోవైపు, చాట్ జీపీటీ మాతృసంస్థ ఓపెన్ ఏఐ సైతం తమ తాజా మోడల్ సిరీస్ ‘జీపీటీ-5.6’ను మొదట కేవలం ‘విశ్వసనీయ భాగస్వాముల చిన్న సమూహం’ కోసం మాత్రమే విడుదల చేయనున్నట్లు గత వారం ప్రకటించింది.
నిపుణులు ఏమంటున్నారు?
ఈ పరిణామాలపై సిడ్నీ విశ్వవిద్యాలయంలోని ఏఐ, ట్రస్ట్ అండ్ గవర్నెన్స్ సెంటర్ డిప్యూటీ డైరెక్టర్ ఫ్రాన్సిస్కో బైలో స్పందిస్తూ, టెక్ వర్గాల్లో ఈ ఆంక్షల ఎత్తివేత ఊహించిందేనని అన్నారు. ‘పరిశోధకులు ఫేబుల్ 5ను జైల్‌బ్రేక్(ఏఐ మోడళ్లకు వాటిని తయారు చేసిన కంపెనీలు కొన్ని భద్రతా నియమాలను, నైతిక పరిమితులను విధిస్తాయి. ప్రమాదకరమైన ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా ఈ ఏఐ మోడళ్లను నియంత్రిస్తారు) చేయగలిగారనే నివేదికలు వాస్తవ తీవ్రత కంటే ఎక్కువగా ప్రచారమయ్యాయి. అమెరికా ప్రభుత్వం అతిగా స్పందించిందని ఆలస్యంగా గ్రహించింది. ఇటువంటి నిర్ణయాలు పరిశ్రమలో గందరగోళాన్ని సృష్టిస్తాయి. ఒకవేళ ఫేబుల్, మైథోస్‌లను నిషేధిస్తే భవిష్యత్తులో మార్కెట్లోకి వచ్చే ఇతర పోటీ నమూనాలను కూడా నిషేధించాల్సి వస్తుంది’ అని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరలు కూల్‌ఆఫ్!


