
దేశంలో జరిగే డిజిటల్ లావాదేవీల్లో అత్యధికం యూపీఐ (UPI) ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ వంటి అనేక యూపీఐ యాప్‌లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిలో లోపాల ద్వారా వినియోగదారులు డబ్బులు పోగుట్టుకుంటున్న సంఘటనలూ అక్కడక్కడా జరగుతున్నాయి. వీటిని నివారించడంలో భాగంగా యూపీఐ యాప్‌లలో కొత్త మార్పులు త్వరలో రానున్నాయి.
యూపీఐ లావాదేవీలో డబ్బులు అంతిమంగా ఎవరికి చేరుతున్నాయన్నది తప్పనిసరిగా ప్రదర్శించాలని యూపీఐ పేమెంట్, భారత్ బిల్ పే, రూపే కార్డ్‌లతోపాటు దేశంలోని అన్ని రిటైల్ చెల్లింపులను నిర్వహించే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) తాజాగా సర్క్యులర్ జారీ చేసింది.
అంతిమ లబ్ధిదారు ఎవరన్నది పేయర్ యాప్‌లో అలాగే లావాదేవీ స్టేట్‌మెంట్, హిస్టరీలోనూ ప్రదర్శించాలని ఎన్‌పీసీఐ సర్క్యులర్‌లో తెలిపింది. సరైన లబ్ధిదారునికి డబ్బు పంపుతున్నామని వినియోగదారుల్లో విశ్వాసం కలిగించడానికి, సంభావ్య ప్రమాదాన్ని నివారించడానికి యూపీఐ యాప్‌లలో మార్పులు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది.
చేయాల్సిన మార్పులివే..
యూపీఐ యాప్‌లు లావాదేవీకి ముందు వివరాల పేజీలో డబ్బు ఎవరికి వెళ్తుందో అంతిమ లబ్ధిదారుని పేరు (ధ్రువీకరించిన ఏపీఐ అడ్రెస్ ద్వారా సంగ్రహించిన లబ్ధిదారు బ్యాంకింగ్ పేరు) మాత్రమే వినియోగదారునికి కనిపించాలి. అలాకాకుండా క్యూఆర్ కోడ్ ల నుంచి సేకరించిన పేర్లు, చెల్లింపుదారు నిర్వచించిన పేర్లు లేదా మరే ఇతర పేర్లను యూపీఐ యాప్ లో పేయర్ కు ప్రదర్శించకూడదు.
యాపీఐ యాప్‌లలో లావాదేవీలకు బెనిఫీషియరీ పేరును మార్చేందుకు వీలు కల్పించే ఫీచర్లు ఉంటే వాటిని తప్పనిసరిగా తొలగించాలి. ఆయా యూపీఐ యాప్‌లన్నీ జూన్ 30 నాటికి ఈ మార్పులు అమలు చేయాలి. లేకుంటే నిబంధనల ఉల్లంఘనగా భావించి చర్యలు తీసుకుంటామని ఎన్‌పీసీఐ స్పష్టం చేసింది.