ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు? | Upcoming IPOs Leela Hotels Aegis Vopak Terminals IPOs to open for subscription | Sakshi
Sakshi News home page

ఇవిగో కొత్త ఐపీవోలు.. కొనుక్కుంటారా షేర్లు?

May 22 2025 11:18 AM | Updated on May 22 2025 11:22 AM

Upcoming IPOs Leela Hotels Aegis Vopak Terminals IPOs to open for subscription

న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ కంపెనీ ష్లాస్‌ బెంగళూరు లిమిటెడ్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 413–435 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. లీలా ప్యాలసెస్‌ హోటల్స్‌ అండ్‌ రిసార్ట్స్‌ బ్రాండుతో కంపెనీ ఆతిథ్య రంగంలో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

ఇష్యూలో భాగంగా కంపెనీ రూ. 2,500 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో రూ. 1,000 కోట్ల విలువైన షేర్లను ప్రమోటర్‌ సంస్థ ప్రాజెక్ట్‌ బాలెట్‌ బెంగళూరు హోల్డింగ్స్‌ ఆఫర్‌ చేయనుంది. తద్వారా రూ. 3,500 కోట్లు సమీకరించాలని భావిస్తోంది. వెరసి దేశీయంగా ఆతిథ్య రంగంలో అతిపెద్ద ఐపీవోగా నిలవనుంది.

రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 34 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులను అనుబంధ సంస్థల రుణ చెల్లింపులతోపాటు.. సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచ్చించనుంది. 2025 మార్చికల్లా కంపెనీ రుణ భారం రూ. 3,900 కోట్లుగా నమోదైంది. లీలా బ్రాండ్‌ సంస్థ 12 హోటళ్ల ద్వారా మొత్తం 3,382 గదుల పోర్ట్‌ఫోలియోను కలిగి ఉంది.  

ఏజిస్‌ వొప్యాక్‌
లాజిస్టిక్స్‌ రంగ సంస్థ ఏజిస్‌ వొప్యాక్‌ టెర్మినల్స్‌ పబ్లిక్‌ ఇష్యూకి రూ. 223–235 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 26న ప్రారంభమై 28న ముగియనుంది. యాంకర్‌ ఇన్వెస్టర్లకు 23న షేర్లను విక్రయించనుంది. ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఏజిస్‌ లాజిస్టిక్స్‌ అనుబంధ సంస్థ ఇది. ఇష్యూలో భాగంగా  రూ. 2,800 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది.

తొలుత రూ. 3,500 కోట్ల సమీకరణకు ప్రణాళికలు వేసినప్పటికీ రూ. 2,800 కోట్లకు కుదించింది. రిటైల్‌ ఇన్వెస్టర్లు కనీసం 63 షేర్లకు(ఒక లాట్‌) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఈక్విటీ జారీ నిధులలో రూ. 2,016 కోట్లు రుణ చెల్లింపులకు, రూ. 671 కోట్లు పెట్టుబడి వ్యయాలకు వెచ్చించనుంది. ఈ నిధులతో మంగళూరులో క్రియోజెనిక్‌ ఎల్‌పీజీ టెర్మినల్‌ను కొనుగోలు చేయనుంది.

కాగా.. కంపెనీ విలువను రూ. 26,000 కోట్లుగా బ్రోకరేజీలు మదింపు చేశాయి. 2024 జూన్‌కల్లా కంపెనీ రుణ భారం రూ. 2,584 కోట్లుగా నమోదైంది. కంపెనీ దేశవ్యాప్తంగా పెట్రోలియం, లూబ్రికెంట్స్, కెమికల్స్, ఎల్‌పీజీ, ప్రొపేన్‌ తదితర లిక్విడ్స్, గ్యాస్‌ సంబంధ స్టోరేజీ సౌకర్యాలను కలిగి ఉంది. కీలక పోర్టులకు సమీపంలో టెర్మినళ్లను ఏర్పాటు చేసింది.

షిప్‌రాకెట్‌ ఐపీవో బాట 
Shiprocket IPO: ఈకామర్స్‌ సంస్థలకు సర్వీసులందించే షిప్‌రాకెట్‌ పబ్లిక్‌ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుగుణంగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి గోప్యతా విధానంలో ముసాయిదా ప్రాస్పెక్టస్‌ దాఖలు చేసింది. తద్వారా ప్రాస్పెక్టస్‌ వివరాలను తొలి దశలో రహస్యంగా ఉంచేందుకు వీలుంటుంది.

కాగా.. టెమాసెక్, జొమాటో తదితర దిగ్గజాలకు పెట్టుబడులున్న కంపెనీ ఐపీవో ద్వారా రూ. 2,000–2,500 కోట్లు సమీకరించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇష్యూ నిధులను ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్, వ్యూహాత్మక కొనుగోళ్లు, లాజిస్టిక్స్‌తోపాటు, వేర్‌హౌసింగ్‌ ఇన్‌ఫ్రా విస్తరణ తదితరాలకు వినియోగించనున్నట్లు సంబంధిత వర్గాఆలు పేర్కొన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement