217 ఏళ్ల ఆర్మీ రహస్య పత్రం గుట్టు విప్పిన ఏఐ | Unlocking Napoleon 217-Year-Old Military Secret How ai Cracked | Sakshi
Sakshi News home page

217 ఏళ్ల ఆర్మీ రహస్య పత్రం గుట్టు విప్పిన ఏఐ

Oct 5 2026 9:06 AM | Updated on Oct 5 2026 9:06 AM

Unlocking Napoleon 217-Year-Old Military Secret How ai Cracked

రెండు శతాబ్దాలకు పైగా ఎవరికీ చిక్కని ఒక చారిత్రక మిస్టరీని ఏఐ సైన్స్ చిటికెలో ఛేదించింది. నెపోలియన్ బోనపార్టే దత్తపుత్రుడు యూజీన్ డి బోహార్నాయిస్ ఆస్ట్రియా బలగాలకు వ్యతిరేకంగా మొహరించిన సైనిక వ్యూహాల సమాచారాన్ని వివరిస్తూ జనరల్ ఆగస్ట్ డీ మార్మోంట్‌కు రాసిన ఒక కోడెడ్ లేఖ గుట్టు ఎట్టకేలకు బట్టబయలైంది.

1807 నాటి ఈ మిలిటరీ లేఖలో దాదాపు 1,300 కోడెడ్ ఎలిమెంట్లు, 155 రకాల విభిన్న సంకేతాలు ఉన్నాయి. గతంలో ఒక చరిత్రకారుడు కేవలం 33 సంకేతాల అర్థాలను మాత్రమే కనుగొనగలిగాడు. మిగిలిన సారాంశమంతా రహస్యంగానే మిగిలిపోవడంతో ఇది క్రిప్టోగ్రాఫర్లకు ఒక పెద్ద సవాలుగా మారింది. అయితే, సైబర్ సెక్యూరిటీ సంస్థ ‘సెంటినెల్‌వన్’కు చెందిన ఏఐ ఇంజినీర్ కార్టర్ చర్చి ఓపెన్ ఏఐ ‘జీపీటీ-6 ఆస్ట్రా’ మోడల్‌ను ఉపయోగించి ఈ చిక్కుముడిని విప్పారు. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే ఈ మోడల్ సంక్లిష్టమైన లేఖను విశ్లేషించి స్పష్టమైన ఆంగ్లంలోకి అనువాదం అందించడం విశేషం.

ఈ ప్రక్రియలో ఏఐ మోడల్ ముందుగా చేతిరాతను గుర్తించి దాన్ని అప్పటికే అందుబాటులో ఉన్న పాక్షిక కోడ్ పట్టికతో సరిపోల్చింది. ఆ తర్వాత ‘సిమ్యులేటెడ్ అన్నిలింగ్’ అనే కంప్యూటేషనల్ విధానం ద్వారా ఫ్రెంచ్ భాషా క్రమాలకు అనుగుణంగా సాధ్యమయ్యే చిహ్నాలను పరిశీలించింది. చారిత్రక ఆధారాల సహాయంతో తుది అంశాలు సరైన అర్థాన్ని ఇస్తాయో లేదో సరిచూసుకుంది.

ఈ విజయం కేవలం ఒక పాత లేఖ రహస్యాన్ని విప్పడానికే పరిమితం కాలేదు. హ్యాండ్‌రైటింగ్ రికగ్నిషన్, చారిత్రక పరిశోధన, క్రిప్టాలసిస్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ వంటి విభిన్న సాంకేతికతల అద్భుత సమ్మేళనానికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. చారిత్రక రహస్యాలకు ప్రామాణికమైన పరిష్కారాలను కనుగొనడంలో ఏఐ పాత్రకు ఇదొక ఉదాహరణ అని పోర్ట్స్‌మౌత్ విశ్వవిద్యాలయ చరిత్ర పరిశోధకుడు జాక్ వైట్ కొనియాడారు.

ఇదీ చదవండి: బంగారం ధరల నుంచి బ్యాంక్ హాలిడేస్ వరకు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement