Uber Green: ఉబర్‌లో సరికొత్త సేవలు.. తొలుత ఆ మూడు నగరాల్లో ప్రారంభం

Uber India To Introduce Uber Green in June To Go All Electric By 2040 - Sakshi

జూన్‌ నుంచి సేవలు ప్రారంభం

రెండేళ్లలో 25,000 ఎలక్ట్రిక్‌ కార్లు

సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్‌

న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల, సుస్థిర వ్యాపార విధానానికి మద్దతుగా ఉబర్‌ గ్రీన్‌ పేరుతో కొత్త సేవలకు రైడ్‌ హెయిలింగ్‌ యాప్‌ ఉబర్‌ శ్రీకారం చుట్టింది. ప్రయాణం కోసం ఉబర్‌ యాప్‌లో కస్టమర్లు ఎలక్ట్రిక్‌ కారును ప్రత్యేకంగా కోరవచ్చు. జూన్‌ నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. తొలుత ఢిల్లీ, ముంబై, బెంగళూరులో ప్రారంభం కానున్నాయి. దశలవారీగా ఇతర నగరాలకు ఈ సేవలను విస్తరిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 15 దేశాల్లోని 100కుపైగా నగరాల్లో ఉబర్‌ గ్రీన్‌ ఆన్‌ డిమాండ్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయని సంస్థ ప్రకటించింది.  

2040 నాటికి పూర్తిగా.. 
‘ఈవీల వాడకం ఊపందుకోవడంతో భారత మార్కెట్‌ కంపెనీకి ప్రాధాన్యతగా నిలిచింది. 2040 నాటికి సంస్థ వేదికగా ప్రతి రైడ్‌ ఎలక్ట్రిక్‌ వాహనం ఆధారంగా ఉండాలన్నదే మా లక్ష్యం’ అని ఉబర్‌ మొబిలిటీ, బిజినెస్‌ ఆపరేషన్స్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ తెలిపారు. దేశవ్యాప్తంగా 8 లక్షల పైచిలుకు యాక్టివ్‌ డ్రైవర్‌ పార్ట్‌నర్స్‌ ఉన్నట్టు చెప్పారు. బుకింగ్స్‌ పరంగా ప్రపంచవ్యాప్తంగా సంస్థకు భారత్‌ మూడవ స్థానంలో ఉందన్నారు. భవిష్యత్‌ వృద్ధిని నడిపించడానికి పెట్టుబడులను కొనసాగిస్తామని వివరించారు. భారత్‌లో 125 నగరాల్లో ఉబర్‌ సేవలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా 70 దేశాల్లోని 10,000 నగరాల్లో ఉబర్‌ వాహనాలు పరుగెడుతున్నాయి.  

పెద్ద ఎత్తున భాగస్వామ్యం.. 
ఉబర్‌ భారత్‌లో ఎలక్ట్రిక్‌ రైడ్‌ చేస్తోంది. తాజాగా పలు ఎలక్ట్రిక్‌ వాహన తయారీ కంపెనీలు, ఇతర సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా వచ్చే రెండేళ్లలో కొత్తగా 25,000 ఎలక్ట్రిక్‌ కార్లను తన వేదికపై జోడించనుంది. ఉబర్‌ చేతులు కలిపిన కంపెనీల్లో లిథియం అర్బన్‌ టెక్నాలజీస్, ఎవరెస్ట్‌ ఫ్లీట్, మూవ్‌ ఉన్నాయి. అలాగే 2024 నాటికి ఢిల్లీ నగరంలో 10,000 ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను ప్రవేశపెట్టేందుకు జిప్‌ ఎలక్ట్రిక్‌తోనూ ఒప్పందం చేసుకుంది. ఉబర్‌ ఈవీల ఫాస్ట్‌ చార్జింగ్‌ కోసం జియో–బీపీ, జీఎంఆర్‌ గ్రీన్‌ ఎనర్జీతోనూ ఒప్పందం చేసుకున్నట్టు ప్రకటించింది.  

రుణ సౌకర్యం కోసం.. 
డ్రైవర్‌ పార్ట్‌నర్స్, ఇతర భాగస్వాములకు ఎలక్ట్రిక్‌ వాహనాల కొనుగోలుకు కావాల్సిన రుణ సౌకర్యం కల్పించేందుకు సిడ్బీతో రూ.1,000 కోట్ల డీల్‌ కుదుర్చుకుంది. పూర్తిగా ఈవీలకు మళ్లడం ఒక సవాల్‌. ఈవీలకు మారే ప్రక్రియలో ఆర్థిక భారం డ్రైవర్లపై పడకూడదు అని ఉబర్‌ ఇండియా, దక్షిణాసియా ప్రెసిడెంట్‌ ప్రభజీత్‌ సింగ్‌ అన్నారు. ‘ఈవీ రంగంలోని ప్రముఖ కంపెనీలతో భాగస్వామ్యం ద్వారా రైడ్‌–షేరింగ్‌ పరిశ్రమలో డ్రైవర్లు వేగంగా ఎలక్ట్రిక్‌కు మారేందుకు సాయం చేస్తున్నాం. 2030 నాటికి యూరప్, ఉత్తర అమెరికాలో సున్నా ఉద్గార స్థాయికి చేరాలని లక్ష్యంగా చేసుకున్నాం. ప్రపంచవ్యాప్తంగా 2040 నాటికి ఈ లక్ష్యానికి చేరుకుంటాం’ అని వివరించారు.

ఇదీ చదవండి: భారీగా పడిపోయిన ఎలక్ట్రిక్‌ టూవీలర్ల అమ్మకాలు.. కారణం ఇదే..

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top