
చెన్నై: టీవీఎస్ మోటార్ విక్రయాలు 2025 జూలై నెలలో మొత్తం 29 శాతం పెరిగి 4,56,350 యూనిట్లకు చేరుకున్నాయని కంపెనీ తెలిపింది. గతేడాది ఇదే జూలైలో డీలర్లకు 3,39,676 వాహనాలు సరఫరా చేసినట్లు పేర్కొంది. దేశీయంగా(భారత్‌లో) 3,08,720 వాహన అమ్మకాలు నమోదవ్వగా, 2024 జూలైలో విక్రయాలు 2,54,250 యూనిట్లగా ఉన్నాయి.
ఇందులో మోటార్‌సైకిల్ విభాగ విక్రయాల వృద్ధి 25 శాతంగా ఉంది. గతేడాది జూలైలో 1,61,074 యూనిట్లుగా ఉండగా, 2025 జూలైలో 2,01,494 యూనిట్లకు చేరాయి. ఇదే జూలైలో మొత్తం 198,265 స్కూటర్లు అమ్ముడయ్యాయి. గతేడాది జూలైలో విక్రయించిన 1,39,995 యూనిట్లతో పోలిస్తే ఇవి 42% అధికంగా ఉన్నాయి.
ఎల్రక్టానిక్ వాహన(ఈవీ) విభాగం అమ్మకాల వృద్ధి 10 శాతంగా ఉంది. మొత్తం 21,442 యూనిట్ల నుంచి 23,605 యూనిట్లకు చేరింది. జూలైలో మొత్తం 1,42,629 యూనిట్లు ఎగుమతి కాగా, గతేడాది ఇదే నెలలో 97,589 యూనిట్లు విదేశాలకు తరలించారు.