
కార్పొరేట్ సంస్థల్లో సాధారణ ఉద్యోగుల జీతాల కంటే ఎగ్జిక్యూటివ్ స్థాయిలో పనిచేసే వారి వేతనాలు అధికంగా ఉంటాయి. దానికితోడు ఏటా వారి వేతన పెరుగుదల శాతం ఎక్కువగానే ఉంటోంది. ఇదే విషయాన్ని తాజాగా ఆక్స్‌ఫామ్ నివేదిక వెల్లడించింది. భారత్‌లో సగటు సీఈవో వేతనం రూ.17.2 కోట్లకు (సుమారు 2 మిలియన్ డాలర్లు) చేరిందని, ప్రపంచవ్యాప్తంగా ఎగ్జిక్యూటివ్ జీతాలు 2019 నుంచి 50 శాతం పెరిగాయని ఆక్స్‌ఫామ్ తెలిపింది.
అదే సమయంలో కిందిస్థాయి ఉద్యోగుల వేతనాలు 1 శాతం మాత్రమే పెరిగాయని నివేదికలో పేర్కొంది. భారత ఆటోమొబైల్‌లో రంగంలోనూ ఇదే తంతు కొనసాగుతోంది. హీరో మోటోకార్ప్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పవన్ ముంజాల్ 2025 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక వేతనం పొందిన ఆటో సెక్టార్ సీఈఓగా నిలిచారు. 2024 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఆయన మొత్తం వేతనం రూ.109.41 కోట్లుగా ఉంది.
గల్లా జయదేవ్
అమర రాజా ఎనర్జీ అండ్ మొబిలిటీ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గల్లా జయదేవ్ 2025 ఆర్థిక సంవత్సరంలో రూ.67.29 కోట్లు పారితోషికం తీసుకున్నారు. అంతక్రితం ఏడాదితో పోలిస్తే ఇది 6 శాతం అధికం. గల్లా వేతనం ఆ కంపెనీలోని ఉద్యోగుల సగటు వేతనం కంటే 2,232 రెట్లు అధికం. ఇదే సమయంలో సగటు ఉద్యోగి వేతనాలు 2.44 శాతం పెరిగాయి.
రాజీవ్ బజాజ్
బజాజ్ ఆటో మేనేజింగ్ డైరెక్టర్ రాజీవ్ బజాజ్ 2025 ఆర్థిక సంవత్సరంలో 9 శాతం వృద్ధితో రూ.58.58 కోట్లు పొందారు. దీంతో కంపెనీ లాభాల్లో వృద్ధి కూడా 9 శాతం పెరిగింది. 2025 ఏప్రిల్ నుంచి మరో ఐదేళ్ల కాలానికి ఆయన పదవికాలం పొడిగించాలని బజాజ్ ఆటో షేర్ హోల్డర్లను కోరింది.
అనీష్ షా
మహీంద్రా గ్రూప్ సీఈఓ, మేనేజింగ్ డైరెక్టర్ అనీష్ షా తొలిసారి టాప్ పెయిడ్ ఆటో సీఈవోల జాబితాలో చోటు దక్కించుకున్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో అతని మొత్తం సంపాదన రూ .47.33 కోట్లకు చేరుకోవడంతో అతని వేతనంలో 95% పెరుగుదల నమోదైంది. షా నాయకత్వంలో మహీంద్రా అండ్ మహీంద్రా భారతదేశ ప్యాసింజర్ వాహన మార్కెట్లో నాలుగో స్థానం నుంచి రెండో స్థానానికి చేరుకుంది. స్కార్పియో, థార్, కొత్తగా లాంచ్ చేసిన ఎక్స్‌యూవీ 3ఎక్స్ఓ వంటి మోడళ్ల విజయం సహాయపడింది.
ఇదీ చదవండి: ఆర్‌కామ్, అనిల్ అంబానీపై ‘ఫ్రాడ్’ ముద్ర
అరవింద్ పొద్దార్
ఎగుమతి ఆధారిత టైర్ల తయారీ సంస్థ బాలకృష్ణ ఇండస్ట్రీస్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అరవింద్ పొద్దార్‌కు కంపెనీ రూ.47.54 కోట్లు చెల్లించింది. జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆయన కుమారుడు రాజీవ్ పొద్దార్‌కు రూ.46.42 కోట్లు పారితోషికం చెల్లించారు.