రతన్‌ టాటా తర్వాత గ్రూప్‌ సారథులు వీరే..? | Sakshi
Sakshi News home page

రతన్‌ టాటా తర్వాత గ్రూప్‌ సారథులు వీరే..?

Published Tue, Nov 21 2023 3:19 PM

Three Heirs To Tata Group Leadership - Sakshi

దేశంలో టాటా గ్రూప్ లెగసీ చాలా పెద్దది. రతన్‌టాటాకు పెళ్లి కాకపోవడంతో తన వ్యాపార సామ్రాజ్యానికి నాయకత్వం వహించేవారు లేకుండాపోయారు. దాంతో దాదాపు రూ.20 లక్షల కోట్ల టాటా గ్రూప్‌ సంస్థలను ఎవరు ముందుకు తీసుకెళతారనే ప్రశ్నలు వస్తున్నాయి. ఆ సామర్థ్యం ఎవరికి ఉందనే చర్చ కొనసాగుతోంది.

అయితే తన ఫ్యామిలీకే చెందిన తన సోదరుడు నోయెల్‌టాటా కుమార్తెలు లేహ్‌, మాయా, కుమారుడు నెవిల్లీలకు రతన్‌ టాటా వ్యాపార మెలకువలు నేర్పుతున్నట్లు జీక్యూ ఇండియా ప్రచురించింది. టాటాగ్రూప్‌ను ముందుకు నడిపే సత్తా వారికి ఉందా అనే అనుమానాలు లేకపోలేదు. కానీ సంస్థతో వారికున్న అనుబంధం, వారి నైపుణ్యాలు, విద్యా ప్రమాణాలు తెలిస్తే టాటా నాయకత్వ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలరని తెలుస్తోంది. 

లేహ్‌ టాటా

 • నోయెల్‌ టాటా పెద్ద కుమార్తె.
 • మాడ్రిడ్‌లోని ఐఈ బిజినెస్ స్కూల్‌లో తన ఎడ్యుకేషన్‌ పూర్తి చేశారు. 
 • తాజ్ హోటల్స్ రిసార్ట్స్ & ప్యాలెస్‌లలో అసిస్టెంట్ సేల్స్ మేనేజర్‌గా తన కెరియర్‌ ప్రారంభించారు. 
 • సేల్స్ విభాగంలో కొంత అనుభవం సంపాదించిన తర్వాత టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్ కంపెనీలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 

మాయా టాటా

 • లేహ్‌ టాటా సోదరి మాయా టాటా.
 • మాయా టాటా రతన్ టాటా మార్గదర్శకత్వంలో టాటా ఆపర్చునిటీస్ ఫండ్‌లో తన కెరియర్‌కు మొదలుపెట్టారు. 
 • ఆమె పోర్ట్‌ఫోలియో మేనేజర్‌గా, ఇన్వెస్టర్‌ రిలేషన్స్‌ రిప్రజంటేటివ్‌గా పని చేశారు.
 • యూనివర్శిటీ ఆఫ్ వార్విక్, బేయెస్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. 
 • టాటా క్యాపిటల్‌, ఎన్ చంద్రశేఖరన్ నేతృత్వంలో రూ.1,000 కోట్లు కేటాయించిన టాటా డిజిటల్ కంపెనీలో కీలకస్థానంలో పనిచేశారు.
 • టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ ఆరుగురు బోర్డు సభ్యుల్లో ఒకరిగా మాయా ఉన్నారు.

నెవిల్లీ టాటా

 • నోయెల్ టాటా చిన్న కుమారుడు.
 • నెవిల్లే టాటా కూడా బేయెస్ బిజినెస్ స్కూల్‌లో చదువుకున్నారు. 
 • ట్రెంట్‌ హైపర్‌మార్కెట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు సారథ్యం వహిస్తున్నారు. ఇది టాటా గ్రూప్‌ బ్రాండ్‌లైన వెస్ట్‌సైడ్ , స్టార్ బజార్‌లకు మాతృసంస్థగా ఉంది. 

ఇదీ చదవండి: ఇకపై 83 షాపులు 24 గంటలు ఓపెన్‌!

టాటా గ్రూప్‌ సంస్థల స్వరూపం

 • టాటా గ్రూప్‌ సంస్థలను 1868లో జెమ్‌షేడ్జీ టాటా స్థాపించారు.  
 • టాటా గ్రూప్ ఆధ్వర్యంలో 30 కంపెనీలు ఉన్నాయి. 
 • ఆరు ఖండాల్లోని 100 కంటే ఎక్కువ దేశాలలో సేవలందిస్తోంది. 
 • టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఐటీ, డిజిటల్ వ్యాపార సేవలందిస్తోంది. 
 • టాటా స్టీల్ సంవత్సరానికి 33 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది.
 • టాటా మోటార్స్ కార్లు, యుటిలిటీ వెహికల్స్, బస్సులు, ట్రక్కులు, డిఫెన్స్ వాహనాలను తయారుచేస్తోంది. 
 • టాటా కెమికల్స్ బేసిక్, స్పెషాలిటీ కెమికల్స్‌ ఉత్పత్తి చేస్తోంది. 
 • టాటా పవర్ దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ కంపెనీ.
 • ఇండియన్ హోటల్స్ టూరిజం, ట్రావెల్‌ ఇండస్ట్రీలో ప్రపంచస్థాయి సేవలందిస్తోంది.
 • టైటాన్ కంపెనీ ద్వారా ఆభరణాలు, కళ్లద్దాలు తయారుచేస్తున్నారు. దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ ఇటీవల రూ.3 లక్షల కోట్లు దాటింది. 
 • టాటా ఎలెక్సీ ఇంజినీరింగ్‌ డిజైన్, సాంకేతిక సేవలు అందిస్తోంది. 
 • టాటా డిజిటల్ ద్వారా వినియోగదారుల అవసరాలు తెలుసుకుని మెరుగైన సేవలు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

టాటా సన్స్ వార్షిక నివేదిక ప్రకారం.. మార్చి 31, 2023 నాటికి టాటా గ్రూపు మార్కెట్ క్యాపిటలైజేషన్‌ రూ.20,71,467 కోట్లుగా ఉంది.

Advertisement
 
Advertisement