5g in India: ఇలా చేస్తే భారత్‌లో 5జీ సేవలు జోరందుకుంటాయ్‌

Telecom deserves better tariffs Can provide 5G with provide good quality service - Sakshi

న్యూఢిల్లీ: దేశీయంగా టెల్కోలు కొత్త టెక్నాలజీలు ఆవిష్కరించాలన్నా, నాణ్యమైన 5జీ సేవలు అందించాలన్నా భారత టెలికం మార్కెట్లో టారిఫ్‌లు లాభసాటిగా ఉండాలని సాఫ్ట్‌బ్యాంక్‌ ఇండియా కంట్రీ హెడ్‌ మనోజ్‌ కొహ్లి అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ప్యాకేజీ టెలికం రంగానికి ఎంతో ఆవశ్యకమని ఆయన పేర్కొన్నారు. 

దేశీయంగా 5జీ విప్లవానికి సిద్ధమయ్యేందుకు పరిశ్రమకు ఇది సహాయపడగలదని కొహ్లి తెలిపారు. ఐవీసీఏ మ్యాగ్జిమం ఇండియా సదస్సు (ఎంఐసీ)లో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు వివరించారు. ‘టారిఫ్‌లు మరింత మెరుగ్గా ఉండాలని నేను భావిస్తున్నాను. అయితే, ఎంత స్థాయిలో  ఉండాలన్నది నేను చెప్పలేను. అది టెలికం సంస్థల ఇష్టం. స్థూలంగా చెప్పాలంటే టెల్కోలు.. కొత్త టెక్నాలజీలతో పాటు 5జీ సేవలను నాణ్యంగా అందించగలిగేంత స్థాయిలో ఉండాలన్నది నా అభిప్రాయం‘ అని కొహ్లి పేర్కొన్నారు. 

భారత్‌లో 5జీ సేవల విస్తరణ వేగంగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ‘విద్యుత్‌ రంగంలాగానే టెలికం కూడా కీలకమైన మౌలిక సదుపాయం. స్థూల దేశీయోత్పత్తి మరింత అధికంగా వృద్ధి చెందడానికి ఇది కూడా ఎంతో ముఖ్యం‘ అని తెలిపారు. వాయిస్‌ సర్వీసులపై వినియోగదారులకు ఆసక్తి తగ్గిందని.. భవిష్యత్తంతా డేటా, కంటెంట్‌దేనని కొహ్లి చెప్పారు. టెల్కోలు ఇందుకు అనుగుణంగా తమ వ్యాపార విధానాలను మార్చుకోవాల్సి ఉంటుందన్నారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top