
దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మంది ఉద్యోగులను తొలగించే యోచనలో ఉన్నట్లు ప్రకటించింది. ఈ తొలగింపు మధ్య, సీనియర్ స్థాయి ఉద్యోగులపై ప్రభావం చూపనుంది.ఈ ప్రకటన ఐటీ రంగంలో ప్రకంపనలు సృష్టించింది. టీసీఎస్ ఉద్యోగుల తొలగింపు ప్రకటనను ఐటీ ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.
ఒత్తిడికి తలొగ్గి రాజీనామాలు చేయొద్దు
ఈటీ నివేదిక ప్రకారం.. టీసీఎస్ తొలగింపులను చట్టవిరుద్ధమని ప్రకటించిన ఐటీ ఉద్యోగ సంఘాలు ఒత్తిడికి తలొగ్గి ఎవరూ రాజీనామా చేయొద్దంటూ టీసీఎస్ సిబ్బందికి సూచించాయి. అదే సమయంలో లేఆఫ్ ప్రణాళికలను ఉపసంహరించుకోవాలని, ప్రభావిత ఉద్యోగాలను పునరుద్ధరించాలని కర్ణాటక స్టేట్ ఐటీ/ఐటీఈఎస్ ఎంప్లాయీస్ యూనియన్ టీసీఎస్ యాజమాన్యాన్ని కోరింది.
రాజీనామా చేయాలని ఉద్యోగులపై ఒత్తిడి చేయొద్దని ఫోరం ఫర్ ఐటీ ఎంప్లాయీస్ (ఎఫ్ఐటీఈ) టీసీఎస్‌ను కోరింది. బాధితులకు నోటీస్ పీరియడ్ పేమెంట్స్, సెవెరెన్స్ బెనిఫిట్స్, ఏడాది పాటు ఇన్సూరెన్స్ కవరేజీని అందించాలని డిమాండ్ చేసింది. టీసీఎస్ ఆర్థికంగా పటిష్టంగా ఉందని, అనిశ్చితులేవీ లేనప్పటికీ ప్రకటించిన ఈ తొలగింపులు పూర్తిగా లాభాపేక్షతో తీసుకున్న నిర్ణయాలేనని ఎఫ్ఐటీఈ పేర్కొంది. అన్ని రికార్డులు సిద్ధం చేసుకోవాలని, స్వచ్ఛంద రాజీనామాలకు ఎవరూ వెళ్లొద్దని, నిష్క్రమించాలని ఒత్తిడి చేస్తే రాష్ట్ర లేబర్ కమిషనర్ లేదా ఎఫ్ఐటీఈ సహాయం తీసుకోవాలని ఉద్యోగులకు సూచించింది.
