
టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్లో వేలాది లేఆఫ్లపై ఆ సంస్థ సీఈవో సత్య నాదెళ్ల ఎమోషనల్గా స్పందించారు. ఇటీవల కంపెనీలో ఇటీవల 9,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించడం తనను తీవ్రంగా ప్రభావితం చేస్తోందని అంగీకరించారు. అయితే సంస్థ ఏఐ పరివర్తనకు ఈ కోతలు అవసరమని ఆయన పేర్కొన్నారు.
కంపెనీ పరిణామాలపై ఆయన ఉద్యోగులకు లేఖలు పంపారు. "అన్నింటికంటే ముందుగా నేను నాపై ఎక్కువ భారం మోపుతున్న వాటి గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇటీవలి ఉద్యోగ తొలగింపుల గురించి మీలో చాలా మంది ఆలోచిస్తున్నారని నాకు తెలుసు" అంటూ సత్య నాదెళ్ల లేఖ మొదలు పెట్టారు. " ఈ నిర్ణయాలు మనం తీసుకోవాల్సిన అత్యంత క్లిష్టమైనవి. మన సహోద్యోగులు, సహచరులు, స్నేహితులు.. మనం ఎవరితో అయితే కలిసి పనిచేశామో, నేర్చుకున్నామో, లెక్కలేనన్ని క్షణాలను పంచుకున్నామో వారిని అవి ప్రభావితం చేస్తాయి" అంటూ రాసుకొచ్చారు.
మైక్రోసాఫ్ట్ 2014 తర్వాత ఈ సంవత్సరం భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగించింది. దాని ప్రపంచ శ్రామిక శక్తిలో 7 శాతం మందికి ఉద్వాసన పలికింది. ఉద్యోగాల కోతలో అనిశ్చితి, అసంబద్ధత కనిపిస్తోందని అంగీకరించిన సత్య నాదెళ్ల కంపెనీ వృద్ధిపై కూడా దృష్టి సారించారు. "మార్కెట్ పనితీరు, వ్యూహాత్మక స్థానం, వృద్ధి ఇలా అంశాల్లో లక్ష్యంతో కూడిన చర్యల ద్వారా మైక్రోసాఫ్ట్ పురోగమిస్తోంది. మనం మునుపటి కంటే మూలధన పెట్టుబడులు ఎక్కువ పెడుతున్నాం. మన మొత్తం హెడ్ కౌంట్లో పెద్దగా మార్పేమీ లేదు. మన పరిశ్రమలో, మైక్రోసాఫ్ట్ లో కొంతమంది ప్రతిభ, నైపుణ్యానికి మునుపెన్నడూ చూడని స్థాయిలో గుర్తింపు, రివార్డులు లభిస్తున్నాయి. అదే సమయంలో లేఆఫ్లూ అమలు చేస్తున్నాం" అని వివరించారు.