
టాటా పవర్ అచ్చమైన సోలార్, పవన విద్యుత్ సంస్థ నుంచి పూర్తిస్థాయి హైబ్రిడ్ పునరుత్పాదక ఇంధన రంగ శక్తిగా అవతరిస్తుందని సంస్థ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ప్రకటించారు. అణు విద్యుత్ అభివృద్ధిని సైతం భవిష్యత్తులో చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. టాటా పవర్ 106వ వార్షిక వాటాదారుల సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా కంపెనీ భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించారు. విద్యుదుత్పాదన, అమలు దశలో కలిపి మొత్తం 25 గిగావాట్ల సామర్థ్యాన్ని కంపెనీ 2024–25లో అధిగమించినట్టు చెప్పారు. ఇందులో 65 శాతం శుద్ధ, పర్యావరణ అనుకూల ఇంధనాల నుంచే ఉన్నట్టు తెలిపారు. ఇటీవలి ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల విచారం వ్యక్తం చేశారు. టాటా గ్రూప్ దశను మలుపు తిప్పిన దివంగత గౌరవ చైర్మన్ రతన్ టాటా సేవలను సైతం ఈ సందర్భంగా స్మరించుకున్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ పునరుత్పాదక, హైడ్రో పవర్ ప్రాజెక్టులకు సంబంధించి భూటాన్ డ్రక్‌తో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలోనే తమిళనాడులోని తిరునల్వేలిలో ఏర్పాటు చేసిన 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్‌ను సంస్థ ప్రారంభించింది. రూ.4,800 కోట్ల విలువ చేసే విద్యుత్ పంపిణీ ప్రాజెక్టులను సైతం దక్కించుకుంది.