
క్యూ1 లాభం రూ. 4,003 కోట్లు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26) తొలి త్రైమాసికంలో ఆటో రంగ దేశీ దిగ్గజం టాటా మోటార్స్ ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్ (క్యూ1)లో నికర లాభం 62% క్షీణించి రూ. 4,003 కోట్లను తాకింది. యూఎస్ టారిఫ్‌లతో జేఎల్‌ఆర్ లాభాలు తగ్గడం, అమ్మకాలు క్షీణించడం, అధిక బేస్ తదితర అంశాలు ప్రభావం చూపాయి. గతేడాది(2024–25) ఇదే కాలంలో రూ. 10,587 కోట్లు ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం రూ. 1,07,102 కోట్ల నుంచి రూ. 1,04,407 కోట్లకు నీరసించింది. గతంలో అంటే 2024 ఏప్రిల్‌లో పూర్తి అనుబంధ సంస్థ టాటా మోటార్స్ ఫైనాన్స్‌ను టాటా క్యాపిటల్(టీసీఎల్)లో విలీనం చేయడంతో రూ. 8,016 కోట్ల టీసీఎల్ ఈక్విటీ షేర్లను అందుకుంది. తద్వారా రూ. 4,975 కోట్ల లాభం జమ చేసుకుంది. ఇది అధిక బేస్‌కు కారణం.
జేఎల్‌ఆర్ తీరిలా: యూకే, ఈయూలో తయారైన కార్లపై యూఎస్ టారిఫ్‌ల కారణంగా బ్రిటిష్ అనుబంధ కంపెనీ జాగ్వార్ ల్యాండ్‌రోవర్(జేఎల్‌ఆర్) ఆదాయం 9% తగ్గి 6.6 బిలియన్ పౌండ్లకు పరిమితమైంది. టారిఫ్‌ల వల్ల జేఎల్‌ఆర్‌పై 25 కోట్ల పౌండ్ల ప్రభావం పడినట్లు టాటా మోటార్స్ గ్రూప్ సీఎఫ్‌వో పీబీ బాలాజీ చెప్పారు. తదుపరి తరం ఎలక్ట్రిక్ వాహనాల తయారీపై 3.8 బిలియన్ పౌండ్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు జేఎల్‌ఆర్ సీఈవో అడ్రియన్ మార్డెల్ పేర్కొన్నారు.
టాటా మోటార్స్ షేరు 2.2% క్షీణించి రూ. 633 వద్ద ముగిసింది.