
ఫుడ్ డెలివరీ, క్విక్‌కామర్స్ ప్లాట్‌ఫామ్ స్విగ్గీ గతేడాది(2024–25) చివరి త్రైమాసికంలో నిరుత్సాకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జనవరి–మార్చి(క్యూ4)లో నష్టం రెట్టింపై రూ. 1,081 కోట్లను తాకింది. క్విక్‌కామర్స్‌పై భారీ పెట్టుబడులు ప్రభావం చూపాయి. అంతక్రితం ఏడాది(2023–24) ఇదే కాలంలో రూ. 555 కోట్ల నష్టం ప్రకటించింది.
మొత్తం ఆదాయం మాత్రం రూ. 3,046 కోట్ల నుంచి రూ. 4,410 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు మరింత అధికంగా రూ. 3,668 కోట్ల నుంచి రూ. 5,610 కోట్లకు పెరిగాయి. ఫుడ్ డెలివరీ విభాగంలో స్థూల ఆర్డర్ విలువ 18 శాతం అధికమై రూ. 7,347 కోట్లకు చేరినట్లు స్విగ్గీ వెల్లడించింది. నిర్వహణ లాభం(ఇబిటా) ఐదు రెట్లు ఎగసి రూ. 212 కోట్లను తాకింది. స్విగ్గీ స్మార్ట్ సగటు ఆర్డర్ విలువ 13 శాతం మెరుగుపడి రూ. 527కు చేరగా.. 316 డార్క్ స్టోర్లను జత కలుపుకుంది.
కాగా స్విగ్గీ ప్రధాన పోటీదారు ఈ మధ్యనే ఎటర్నల్‌గా పేరు మార్చుకున్న జొమాటో నికర లాభాలు కూడా భారీగా పడిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరం (2024-25) మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో సంస్థ నికర లాభాలు 78 శాతం పతనమై రూ39 కోట్లతో సరిపెట్టుకుంది. సంస్థ రెవెన్యూ 64 శాతం పెరిగి రూ.5,833 కోట్లుగా చోటు చేసుకుంది. కంపెనీ వ్యయాలు 68 శాతం పెరిగి రూ.6,104 కోట్లకు చేరడంతో లాభాల్లో తగ్గుదల చోటు చేసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది.