
రెండు రోజుల నష్టాలకు బ్రేక్
అర శాతం పెరిగిన సూచీలు
ముంబై: ప్రయివేటు రంగ బ్యాంకులు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకుతో పాటు మెటల్ షేర్లు రాణించడంతో స్టాక్ సూచీలు సోమవారం అరశాతానికి పైగా లాభపడ్డాయి. సెన్సెక్స్ 443 పాయింట్లు పెరిగి 82,200 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 122 పాయింట్లు బలపడి 25,091 వద్ద నిలిచింది. ఆసియా మార్కెట్లలోని సానుకూల సంకేతాలు, విదేశీ ఇన్వెస్టర్ల పునరాగమనం సెంటిమెంట్‌ను మరింత బలపరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 516 పాయింట్లు పెరిగి 82,274 వద్ద, నిఫ్టీ 143 పాయింట్లు బలపడి 25,111 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. కాగా.. డాలర్ మారకంలో రూపాయి విలువ 15 పైసలు బలహీనపడి 86.31 వద్ద స్థిరపడింది.
బీఎస్‌ఈలో రంగాల వారీ ఇండెక్సుల్లో క్యాపిటల్ గూడ్స్ 1.33%, బ్యాంకెక్స్ 1.28%, ఫైనాన్సియల్ సరీ్వసెస్ 1.26%, మెటల్, కమోడిటీస్ 1%, ఆటో, కన్జూమర్ డిస్క్రేషనరీ 0.5% చొప్పున పెరిగాయి.
అంచనాలకు మించి తొలి త్రైమాసిక నికరలాభం రూ.16,258 కోట్ల నమోదుతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేరు 2% పెరిగి రూ.2,000 వద్ద స్థిరపడింది. క్యూ1 ఆరి్థక ఫలితాల ప్రకటన సందర్భంగా ఒక్కో షేరుకు రూ.5 ప్రత్యేక మధ్యంతర డివిడెండ్, తొలిసారి 1:1 నిష్పత్తిలో బోనస్ షేర్ల జారీతో పాటు బ్రోకరేజ్ సంస్థలు షేరుకు ‘బై’ రేటింగ్ కేటాయింపు అంశాలు కలిసొచ్చాయి.
ఐసీఐసీఐ బ్యాంకు షేరు 3% లాభపడి రూ.1,466 వద్ద స్థిరపడింది. తొలి త్రైమాసికంలో మెరుగైన పనితీరు ప్రదర్శించడంతో పాటు ఆస్తుల నాణ్యత మెరుగుపడటంతో ఈ షేరుకు కొనుగోళ్ల మద్దతు లభించింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు 3% నష్టపోయి రూ.1428 వద్ద నిలిచింది. తొలి త్రైమాసికంలో ఆయిల్–కెమికల్స్(ఓ2సీ), రిటైల్ విభాగాల పనితీరు నిరాశపరచడంతో పాటు ఇటీవలి ర్యాలీతో షేరులో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.