కొత్త ఏడాదిలో ‘స్మార్ట్‌’గా ఫోన్ల అమ్మకాలు

Smartphone industry set for smart growth in New Year - Sakshi

20 కోట్ల షిప్‌మెంట్‌ అంచనా

కలిసిరానున్న 5జీ ఫోన్ల డిమాండ్‌

మొబైల్‌ పరిశ్రమ వర్గాల అంచనా

ముంబై: కొత్త ఏడాదిలో స్మార్ట్‌ఫోన్లకు భారీ గిరాకీ ఉంటుందని పరిశ్రమ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. వచ్చే ఏడాదిలో 20 కోట్ల అమ్మకాలు జరుగుతాయని అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా 5జీ ఫోన్లకు డిమాండ్‌ పెరగడంతో పాటు దిగ్గజ మొబైల్‌ కంపెనీల మధ్య పోటీతత్వం ఫోన్ల ఎగుమతులు పెరిగేందుకు తోడ్పడతాయని విశ్లేషకులు చెబుతున్నారు. ‘‘భారత స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ గత ఐదేళ్ల నుంచి స్థిరమైన వృద్ధి పథంలో పయనిస్తోంది.

కోవిడ్‌ ప్రేరేపిత లాక్‌డౌన్ల కారణంగా ఈ ఏడాది పరిశ్రమ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. సెమికండెక్టర్ల కొరత సహా అన్ని అవాంతరాలను అధిగమిస్తూ కొత్త ఏడాదిలో 20 కోట్ల యూనిట్ల ఎగుమతుల లక్ష్యాన్ని చేరేందుకు పరిశ్రమ సిద్ధంగా ఉంది’’ అని కౌంటర్‌ పాయింట్‌ రీసెర్చ్‌ విశ్లేషకులు శిల్పి జైన్‌ తెలిపారు. ఈ ఏడాదిలో (2021)మొత్తం 167–168 మిలియన్ల స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు జరిగినట్లు కౌంటర్‌ పాయింట్‌ నివేదిక పేర్కొంది  

5జీ స్మార్ట్‌ఫోన్ల ఊతం
ఇటీవల కస్టమర్లు 5జీ స్మార్ట్‌ఫోన్ల కొనుగోళ్లకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో వచ్చే ఏడాది నుంచి 5జీ నెట్‌వర్క్‌ అందుబాటులోకి రావచ్చు. ప్రస్తుత డిమాండ్‌కు తగ్గట్లు షావోమి, శాంసంగ్, వివో, ఒప్పో, వన్‌ప్లస్‌ కంపెనీలు 5జీ ఫోన్లు తయారీపై దృష్టి సారించాయి. ప్రారంభ ధరలోనే 5జీ స్మార్ట్‌ఫోన్లను మార్కెట్లోకి  తెచ్చేందుకు సన్నద్ధమయ్యాయి. 5జీ ఫోన్లకు నెలకొన్న డిమాండ్‌ కలిసిరావడంతో మొత్తం స్మార్ట్‌ఫోన్ల ఎగుమతులు పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. ‘ఈ ఏడాది(2021)లో 2.8 కోట్ల 5జీ ఫోన్ల షిప్‌మెంట్‌ జరిగింది. వచ్చే ఏడాదిలో 129 వృద్ధితో మొత్తం 6.8 మిలియన్ల అమ్మకాలు జరగవచ్చు. దీంతో కొత్త ఏడాదిలో స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు 190 మిలియన్ల మార్కును అందుకోనే వీలుంది‘ అని సైబర్‌ మీడియా రీసెర్చ్‌ విశ్లేషకులు ఆనంద్‌ ప్రియా సింగ్‌ తెలిపారు

కేంద్రం చేయూత
కోవిడ్‌ ప్రేరేపిత లాక్‌డౌన్ల కారణంగా ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న సెమికండెక్టర్ల కొరత ప్రభావం దేశీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌పైనా పడింది. దీంతో ఈ గతేడాది స్మార్ట్‌ ఫోన్ల ఎగుమతులు అంచనాల కంటే 20 శాతం తక్కువగా నమోదైంది. అయితే సెమీ కండక్టర్లు, కాంపొనెంట్ల తయారీ, డిస్‌ప్లే ఫ్యాబ్రికేషన్‌ ఏర్పాటుకు కేంద్రం డిసెంబర్లో రూ.76,000 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను ప్రకటించింది. పీఎల్‌ఐ స్కీమ్‌ను ఎలక్ట్రానిక్స్‌ సెగ్మెంట్‌కు విస్తరించడంతో దేశంలో ఫోన్ల తయారీ బాగా పెరగవచ్చని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అలాగే మొబైల్‌ ఫోన్ల తయారీ, వాటి విడిబాగాల తయారీని పెంచేందుకు తలపెట్టిన ఫేజ్డ్‌ మాన్యుఫాక్చరింగ్‌ ప్రోగ్రామ్‌ (పీఎంపీ) కూడా కలిసొస్తుందని మొబైల్‌ పరిశ్రమ వర్గాలు ఆశిస్తున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top