బంగారం ధరలు మాదిరిగా కాకుండా.. వెండి ధరలు ఊహకందని రీతిలో పెరిగిపోతున్నాయి. వారం రోజుల్లో (డిసెంబర్ 14 నుంచి 20 వరకు) సిల్వర్ రేటు ఏకంగా రూ. 16,000 పెరిగింది. దీన్ని బట్టి చూస్తే వెండి రేటు ఏ స్థాయిలో పెరిగిందో స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.
2025 డిసెంబర్ 14న రూ. 2,10,000 వద్ద ఉన్న కేజీ వెండి రేటు.. 20వ తేదీ (శనివారం) నాటికి రూ. 2,26,000లకు చేరుకుంది. దీన్నిబట్టి చూస్తే.. ఒక గ్రామ్ సిల్వర్ రేటు 226 రూపాయలకు చేరిందన్న మాట. వారం రోజుల్లో రెండు రోజులు మాత్రమే తగ్గిన రేట్లు, మిగిలిన నాలుగు రోజులు పెరుగుదల దిశగానే వెళ్లాయి.
వెండి రేటు పెరగడానికి ప్రధాన కారణాలు
వెండిని కేవలం.. ఆభరణాల రూపంలో మాత్రమే కాకుండా, ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, టెలికాం, వైద్య సాంకేతికత, బయోఫార్మా వంటి పరిశ్రమలలో విరివిగా ఉపయోగిస్తున్నారు. సౌర ఫలకాలు, బ్యాటరీలు, ఎలక్ట్రానిక్ భాగాలలో కూడా సిల్వర్ కీలకంగా మారింది. ఇవన్నీ వెండి డిమాండును అమాంతం పెంచడంలో దోహదపడ్డాయి. ఇది ధరల పెరుగుదలకు కారణమైంది.


