
న్యూఢిల్లీ: స్టెయిన్‌లెస్ స్టీల్ ట్యూబ్స్, పైపుల తయారీ కంపెనీ స్కోడా ట్యూబ్స్ పబ్లిక్ ఇష్యూకి రూ. 130–140 ధరల శ్రేణి ప్రకటించింది. ఇష్యూ ఈ నెల 28న ప్రారంభమై 30న ముగియనుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు 27న షేర్లను విక్రయించనుంది. ఇష్యూలో భాగంగా రూ. 220 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. తద్వారా రూ. 220 కోట్లు అందుకోనుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం 100 షేర్లకు(ఒక లాట్) దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది.
ఇష్యూ నిధులను సీమ్‌లెస్, వెల్డెడ్ ట్యూబ్స్, పైప్స్ ఉత్పత్తి సామర్థ్య విస్తరణకు వెచ్చించనుంది. అంతేకాకుండా వర్కింగ్ క్యాపిటల్, సాధారణ కార్పొరేట్ అవసరాలకు నిధులను కేటాయించనుంది. ధరల శ్రేణి ప్రకారం కంపెనీ విలువను రూ. 840 కోట్లుగా బ్రోకరేజీలు అంచనా వేశాయి. ఈపీసీ, ఇండస్ట్రియల్ కంపెనీలకు ఉత్పత్తులను సరఫరా చేస్తుంది. ఆయిల్ అండ్ గ్యాస్, కెమికల్స్, ఫెర్టిలైజర్స్, విద్యుత్ తదితర రంగాలలో వీటిని వినియోగిస్తారు.
27 నుంచి బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ఐపీవో
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్ బ్లూ వాటర్ లాజిస్టిక్స్ ప్రతిపాదిత ఐపీవో మే 27న ప్రారంభమై 29న ముగుస్తుంది. యాంకర్ ఇన్వెస్టర్లకు మే 26 బిడ్డింగ్ తేదీగా ఉంటుంది.
పబ్లిక్ ఇష్యూ కోసం ఒక్కో షేరు ధర శ్రేణి 132–135గా నిర్ణయించారు. ఈ ఇష్యూ ద్వారా రూ. 40.50 కోట్లు సమీకరించనున్న బ్లూ వాటర్ సంస్థ ఎన్‌ఎస్‌ఈ ఎమర్జ్ ప్లాట్‌ఫాంలో లిస్ట్ కానుంది. ఇష్యూ ద్వారా సమీకరించిన నిధులను వాహనాల కొనుగోలు, వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం ఉపయోగించుకోనుంది.