సుప్రీంకోర్టులో వేదాంతకు ఊరట

SC upholds foreign tribunal award in favour of Vedanta - Sakshi

‘రవ్వ’ క్షేత్ర వ్యయాల వివాదంలో అనుకూలంగా ఉత్తర్వులు

కేంద్రానికి ఎదురుదెబ్బ

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లోని రవ్వ చమురు, గ్యాస్‌ క్షేత్ర వ్యయాల రికవరీ అంశంలో వివాదానికి సంబంధించి వేదాంతకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. వేదాంత 499 మిలియన్‌ డాలర్లు రికవర్‌ చేసుకునేలా మలేషియా ట్రిబ్యునల్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటీషన్‌ను అత్యున్నత న్యాయస్థానం కొట్టివేసింది. మలేషియా ట్రిబ్యునల్‌ ఉత్తర్వులతో భారత ప్రభుత్వ విధానాలకు భంగమేమీ కలగబోదని పేర్కొంది. వివరాల్లోకి వెడితే .. ప్రస్తుతం వేదాంతలో విలీనమైన కెయిర్న్‌ ఇండియా గతంలో.. రవ్వ క్షేత్రాల అభివృద్ధికి సంబంధించి కాంట్రాక్టు దక్కించుకుంది.

ఉత్పత్తిలో వాటాల ఒప్పందం (పీఎస్‌సీ) ప్రకారం దీని అభివృద్ధి వ్యయాలను 198.5 మిలియన్‌ డాలర్లకు పరిమితం చేయాల్సి ఉంది. దానికి అనుగుణంగానే ఇంధనాల ఉత్పత్తి ద్వారా వ్యయాలను రికవర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే, దీనికి విరుద్ధంగా వేదాంత ఏకపక్షంగా ఏకంగా 499 మిలియన్‌ డాలర్లు రాబట్టుకుందని, దీనితో ఖజానాకు న ష్టం వాటిల్లిందని కేంద్ర ప్రభుత్వం ఆరోపించింది. ఆర్బిట్రేషన్‌ కోసం ఇరు పక్షాలు మలేషియా ట్రిబ్యునల్‌ను ఆశ్రయించగా వేదాంతకు అనుకూలంగా ఉత్తర్వులు వచ్చాయి. కేంద్రం దీనిపై ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా మలేషియా ట్రిబ్యునల్‌ ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు న్యాయస్థానం నిరాకరించింది. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించినా అక్కడా కేంద్రానికి చుక్కెదురైంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top