2–3 నెలలవరకూ చాన్స్ లేనట్లే
ఎస్‌బీఐ చైర్మన్ సీఎస్ శెట్టి అంచనా
ముంబై: సమీప భవిష్యత్‌లో డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెరిగే అవకాశంలేదని ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్‌బ్యాంక్(ఎస్‌బీఐ) చైర్మన్ సీఎస్ శెట్టి తాజాగా అంచనా వేశారు. తాజా పరపతి సమీక్షలో ఆర్‌బీఐ వడ్డీ రేట్లకు కీలకమైన రెపోను 0.25 శాతం పెంచినప్పటికీ కనీసం 2–3 నెలలవరకూ డిపాజిట్లపై వడ్డీ రేటు పెరగకపోవచ్చని అభిప్రాయపడ్డారు. బ్యాంకింగ్ వ్యవస్థలో తగినంత లిక్విడిటీ ఉండటమే దీనికి కారణమని తెలియజేశారు.
ఆర్‌బీఐ కఠిన విధానాలవైపు మళ్లడంపై స్పందిస్తూ మరో మూడు త్రైమాసికాలవరకూ బ్యాంకుల నికర వడ్డీ మార్జిన్లు(ఎన్‌ఐఎం) మెరుగుపడేందుకు ఇవి దోహదపడనున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం అత్యధికస్థాయిలో నమోదవుతున్న రుణ వృద్ధి(క్రెడిట్ గ్రోత్) కొనసాగితే నిధుల సమీకరణ కోసం కొన్ని బ్యాంకులు డిపాజిట్ల రేట్లను పెంచే అవకాశమున్నదని తెలియజేశారు.
ద్రవ్యోల్బణం పెరుగుతున్న కారణంగా డిపాజిటర్లకు కొంతమేర వాస్తవిక వడ్డీ రేటు లబ్దిని చేకూర్చవలసి ఉన్నట్లు అభిప్రాయపడ్డారు. క్రెడిట్ గ్రోత్‌పై స్పందిస్తూ దేశంలోనే టాప్ ర్యాంకులో ఉన్న ఎస్‌బీఐ లోన్ బుక్ 14–15 శాతంస్థాయిలో విస్తరించనున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నామినల్ జీడీపీకంటే కనీసం 2–3 శాతం అధికంగా క్రెడిట్ గ్రోత్‌ను సాధించవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. నామినల్ జీడీపీ 12 శాతం పురోగతి సాధిస్తే 14–15 శాతం క్రెడిట్ గ్రోత్‌ను అందుకోవలసి ఉంటుందని వివరించారు.


