అంబానీ సోదరులకు శాట్‌లో ఊరట

SAT overturns Sebi order against Ambani brothers - Sakshi

సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా రద్ధు

న్యూఢిల్లీ: రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ టేకోవర్‌ నిబంధనలు ఉల్లంఘన కేసులో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ముకేశ్‌ అంబానీ, అనిల్‌ అంబానీ తదితరులపై సెబీ విధించిన రూ.25 కోట్ల జరిమానా ఆదేశాలను సెక్యూరిటీస్‌ అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌ (శాట్‌) కొట్టివేసింది. సెబీ ఆదేశాలను అంబానీ సోదరులు అప్పీల్‌ చేయడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. షేర్లను గణనీయంగా కొనుగోలు చేయడం, స్వా«దీనం చేసుకోవడం (ఎస్‌ఏఎస్‌టీ) నిబంధనలను అప్పీలుదారు ఉల్లంఘించలేదని నిర్ధారిస్తూ, దీంతో సెబీ విధించిన జరిమానా ఆదేశాలు చెల్లుబాటు కావని శాట్‌ తేల్చింది. సెబీ ఆదేశాల మేరకు ఇప్పటికే అంబానీ సోదరులు, ఇతర సంస్థలు రూ.25 కోట్లను డిపాజిట్‌ చేయగా, వాటిని తిరిగి ఇచ్చేయాలని శాట్‌ ఆదేశించింది.

2000కు ముందు కేసు..
2000కు ముందు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌కు సంబంధించిన కేసు ఇది. కంపెనీలో 5 శాతానికి పైగా వాటాలను (మొత్తం 6.83 శాతం) ప్రమోటర్లు, పర్సన్స్‌ యాక్టింగ్‌ ఇన్‌ కన్సర్ట్‌ (పీఏసీలు)లతో కొనుగోలు చేసినా కానీ, ఆ సమాచారాన్ని వెల్లడించలేదంటూ సెబీ తప్పుబట్టింది. ఈ కేసులో ముకేశ్‌ అంబానీ ఆయన భార్య నీతా అంబానీ, అనిల్‌ అంబానీ, ఆయన భార్య టీనా అంబానీ, ఇతర సంస్థలు నిబంధనలు పాటించలేదని 2021 ఏప్రిల్‌లో జరిమానా విధిస్తూ, ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. సెబీ డిస్‌క్లోజర్‌ నిబంధనల కింద 5 శాతానికి మించి వాటాలు కొనుగోలు చేస్తే ఆ సమాచారాన్ని వెల్లడించడం తప్పనిసరి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top