మూడు కంపెనీల లిస్టింగ్‌కు ఓకే | SEBI Clears Three IPOs Amid War Driven Oil Price Surge and Weak Secondary Markets | Sakshi
Sakshi News home page

మూడు కంపెనీల లిస్టింగ్‌కు ఓకే

Mar 17 2026 8:56 AM | Updated on Mar 17 2026 8:56 AM

SEBI Clears Three IPOs Amid War Driven Oil Price Surge and Weak Secondary Markets

సెకండరీ స్టాక్‌ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్న నేపథ్యంలో కొద్ది రోజులుగా ప్రైమరీ మార్కెట్లలో సందడి తగ్గింది. పశ్చిమాసియాలో చెలరేగిన యుద్ధ జ్వాలలు, ముడిచమురు రవాణాకు విఘాతం కలగడంతో మండుతున్న ధరలు ప్రభావం చూపుతున్నాయి. అయినప్పటికీ తాజాగా క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ మూడు కంపెనీల ప్రాస్పెక్టస్‌లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వివరాలు చూద్దాం.. 

స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌కు అనుమతి పొందిన తాజా జాబితాలో ట్రావెల్‌స్టాక్‌ టెక్, లెర్న్‌ఫ్లుయెన్స్‌ ఎడ్యుకేషన్, టీ పోస్ట్‌ చేరాయి. ఈ మూడు కంపెనీలు గతేడాది జూన్, డిసెంబర్‌ మధ్య కాలంలో సెబీకి ముసాయిదా పత్రాలు దాఖలు చేశాయి. అయితే మరో మూడు కంపెనీలు ఐపీవో రేసు నుంచి తప్పుకోవడం లేదా ప్రాస్పెక్టస్‌లను సెబీ తిప్పిపంపడం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో రేస్‌ పవర్‌ ఇన్‌ఫ్రా, మాధుర్‌ ఐరన్‌ అండ్‌ స్టీల్, అర్జున్‌ జ్యువెలర్స్‌ ఉన్నాయి. ఈ కేలండర్‌ ఏడాది(2026)లో ఇప్పటివరకూ 12 కంపెనీలు ఐపీవో చేపట్టడం ద్వారా నిధులు సమీకరించాయి. ఈ బాటలో మరికొన్ని కంపెనీలు సైతం ఈ నెలాఖరుకల్లా పబ్లిక్‌ ఇష్యూలకు వచ్చే అవకాశమున్నట్లు నిపుణులు పేర్కొన్నారు.

ట్రావెల్‌ టెక్నాలజీ

ఐపీవోలో భాగంగా ట్రావెల్‌ టెక్నాలజీ కంపెనీ.. ట్రావెల్‌స్టాక్‌ టెక్‌ రూ. 250 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 2,68,52,969 షేర్లను కంపెనీ ప్రమోటర్లు, ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. ఈక్విటీ జారీ నిధుల్లో రూ. 135 కోట్లు వర్కింగ్‌ క్యాపిటల్‌కు, రూ. 45 కోట్లు రుణ చెల్లింపులకు, మిగిలిన సొమ్మును సాధారణ కార్పొరేట్‌ అవసరాలకు వెచి్చంచనుంది.  

లక్ష్య కోచింగ్‌

లక్ష్య బ్రాండుతో కోచింగ్‌ సెంటర్లను నిర్వహిస్తున్న లెర్న్‌ఫ్లుయెన్స్‌ ఎడ్యుకేషన్‌ పబ్లిక్‌ ఇష్యూకి రానుంది. దీనిలో భాగంగా రూ. 246 కోట్ల విలువైన ఈక్విటీని తాజాగా జారీ చేయనుంది. వీటికి జతగా మరో 40 లక్షల ఈక్విటీ షేర్లను ప్రస్తుత వాటాదారులు ఆఫర్‌ చేయనున్నారు. ఇష్యూ నిధులను కొత్తగా క్యాంపస్‌ల ఏర్పాటుతోపాటు.. సేల్స్, మార్కెటింగ్‌ కార్యక్రమాలకు, రుణ చెల్లింపులకు, దీర్ఘకాలిక క్యాంపస్‌ల లీజ్‌ చెల్లింపులకు వినియోగించనుంది.

టీ కేఫ్‌..

టీ కేఫ్‌ బ్రాండ్‌ స్టోర్ల నిర్వాహక కంపెనీ టీ పోస్ట్‌ త్వరలో పబ్లిక్‌ ఇష్యూ చేపట్టనుంది. ఇందుకు అనుగుణంగా 1.43 కోట్ల ఈక్విటీ షేర్లను తాజాగా జారీ చేయనుంది. అంతేకాకుండా మరో 1.43 కోట్ల షేర్లను ప్రస్తుత వాటాదారులు విక్రయానికి ఉంచనున్నారు. కంపెనీ నిర్వహణలో కొత్తగా టీ కేఫ్‌ల ఏర్పాటుకు ప్రధానంగా ఐపీవో నిధులను వెచి్చంచే యోచనలో ఉంది.

ఫోన్‌పే ప్రస్తుతానికి నో

డిజిటల్‌ చెల్లింపుల దిగ్గజం ఫోన్‌పే పబ్లిక్‌ ఇష్యూ సన్నాహాలు ప్రస్తుతానికి నిలిచిపోయాయి. ప్రస్తుత రాజకీయ, భౌగోళిక వివాదాల నేపథ్యంలో ఐపీవో యోచనను ప్రస్తుతానికి వాయిదా వేసుకుంటున్నట్లు ఫోన్‌పే తాజాగా పేర్కొంది. యుద్ధ భయాల కారణంగా సెకండరీ స్టాక్‌ మార్కెట్లు తీవ్ర ఆటుపోట్లను చవిచూడటం తదితర అంశాలు దీనికి కారణంగా తెలియజేసింది. అయితే ప్రపంచ క్యాపిటల్‌ మార్కెట్లలో నిలకడ కనిపిస్తే తిరిగి లిస్టింగ్‌ ప్రాసెస్‌కు తెరతీయనున్నట్లు తెలియజేసింది. యుద్ధ ప్రభావానికి లోనవుతున్న ప్రాంతాలలో వేగంగా శాంతి నెలకొంటుందని భావిస్తున్నట్లు ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయంగా ఫోన్‌పేను లిస్ట్‌ చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు ఈ సందర్భంగా వెల్లడించారు.

ఇదీ చదవండి: దేశంలోనే టాప్‌ 10 రుణ ఎగవేతదారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement