అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి | Rich Dad Poor Dad Robert Kiyosaki latest tweet on Iran War | Sakshi
Sakshi News home page

అదీ ‘ఆర్థిక’ యుద్ధమే: రాబర్ట్ కియోసాకి

Mar 6 2026 1:49 PM | Updated on Mar 6 2026 2:05 PM

Rich Dad Poor Dad Robert Kiyosaki latest tweet on Iran War

ప్రసిద్ధ ‘రిచ్‌ డాడ్‌ పూర్‌ డాడ్‌’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత రాబర్ట్‌ కియోసాకి (Robert Kiyosaki) వియత్నాం యుద్ధం ముగిసిన తరువాత మూడోసారి చేసిన వియత్నాం పర్యటన సందర్భంగా తన అనుభూతులను సోషల్ మీడియాలో పంచుకున్నారు. వియత్నాం యుద్ధం (Vietnam War) తర్వాత ఆయన చేసిన ఈ పర్యటనలో వియత్నాం ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందుతున్నదని రాసుకొచ్చారు.

అయితే యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సహ పైలట్లు, సహాధ్యాయుల జ్ఞాపకాలు తాను మర్చిపోలేకపోతున్నానని పేర్కొన్నారు. వియత్నాం యుద్ధ సమయంలో హెలికాప్టర్ పైలట్‌గా పనిచేసిన కియోసాకి, యుద్ధం వెనుక ఉన్న నిజాలను తెలుసుకోవాలనే ప్రయత్నంలోనే తాను మళ్లీ మళ్లీ వియత్నాంకు వెళ్తున్నానని తెలిపారు. “నిజాన్ని ఎంత ఎక్కువగా వెతుకుతానో, అది అబద్ధాల కింద దాగి ఉందనే విషయం అంతగా అర్థమవుతోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.

యుద్ధాలు తరచుగా ఆర్థిక ప్రయోజనాల కోసమే జరుగుతాయని కియోసాకి తన పోస్టులో అభిప్రాయం వ్యక్తం చేశారు. పన్ను చెల్లింపుదారుల డబ్బుతో యుద్ధాలు నడుస్తాయని, అయితే యువత, వారి కుటుంబాలే ప్రాణ నష్టాన్ని భరిస్తారని ఆయన పేర్కొన్నారు. వియత్నాం యుద్ధం కూడా చమురు ప్రయోజనాల కోసం జరిగిందని ఆయన అభిప్రాయపడుతూ, ప్రస్తుతం ఇరాన్‌ (Iran War) చుట్టూ జరుగుతున్న ఉద్రిక్తతలతో పోల్చారు.

ఇదే సందర్భంలో, యుద్ధాల వెనుక ఉన్న ఆర్థిక ప్రయోజనాల గురించి వివరించే ఎంపైర్‌ ఆఫ్‌ లైస్‌ (Empire of Lies) అనే పుస్తకాన్ని చదవాలని ఆయన సూచించారు. నిజాలను తెలుసుకోవాలనుకునే వారు ఇలాంటి పుస్తకాలను చదవాలని ఆయన పిలుపునిచ్చారు.

సాంప్రదాయ విద్యా వ్యవస్థపై కూడా కియోసాకి ప్రశ్నలు లేవనెత్తారు. పాఠశాలల్లో సరైన ఆర్థిక విద్య అందకపోవడం వల్ల ప్రజలు ఆర్థిక వ్యవస్థల నిజాలను పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారని ఆయన వ్యాఖ్యానించారు.

“నిజాన్ని వెతికే వ్యక్తులుగా మారండి, అబద్ధాల వల్ల మోసపోయే బాధితులుగా కాకండి” అని ఆయన తన సందేశాన్ని ముగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement