Telangana: రెరా లేకుండానే విక్రయాలు

Rera: Builders and developers over selling undivided share of land - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గృహ కొనుగోలుదారులకు భద్రత, పెట్టుబడులకు రక్షణ కల్పించే టీఎస్‌ రియల్‌ ఎస్టేట్‌ రెగ్యులేటరీ అథారిటీ (టీఎస్‌ రెరా) లక్ష్యానికి కొందరు డెవలపర్లు తూట్లు పొడుస్తున్నారు. నిర్మాణ అనుమతులు రాకముందే, రెరాలో నమోదు చేయకుండానే అవిభాజ్య స్థలం వాటా (యూడీఎస్‌) కింద య«థేచ్ఛగా విక్రయాలు చేస్తున్నారు. కొందరు డెవలపర్లయితే స్థల యజమానితో ఒప్పందం చేసుకొని.. తనది కాని స్థలంలో ఆకాశహర్మ్యం నిర్మిస్తామని మాయమాటలు చెప్పి కొనుగోలుదారులకు కుచ్చుటోపీ పెడుతున్నారు.

ప్రతిపాదిత హెచ్‌ఎండీఏ అనుమతులు అని బ్రోచర్‌లో ముద్రించి యూడీఎస్‌ కింద విక్రయాలనే చేస్తోంది కరోనా సమయంలో పుట్టుకొచ్చిన ఓ నిర్మాణ సంస్థ. మేడ్చల్‌లో 3.04 ఎకరాలలో లగ్జరీ అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నామని ప్రకటించింది. 1,100 నుంచి 1,525 చ.అ. విస్తీర్ణంలో మొత్తం 273 రెండు, మూడు పడక గదులను నిర్మిస్తున్నామని సామాజిక మాధ్యమాలలో విపరీతంగా ప్రచారం చేస్తోంది.

అయితే ఈ ప్రాజెక్ట్‌కు ఇప్పటివరకు నిర్మాణ అనుమతులు రాలేదు, టీఎస్‌ రెరాలో నమోదు కాకుండానే 60–80 వరకు గృహాలను విక్రయించడం గమనార్హం. విక్రయ ధర కూడా వేర్వేరుగా ఉంటుందట. రెగ్యులర్‌ ధర రూ.3,499 కాగా.. ఆఫర్‌ కింద రూ.2,200కే విక్రయిస్తుందంట. అంటే 2 బీహెచ్‌కే ధర రూ.24.20 లక్షలు. అదే బ్యాంక్‌ రుణం ద్వారా కొనుగోలు చేస్తే.. చ.అ.కు రూ.2,600 అంట. 2 బీహెచ్‌కేకు రూ.28.60 లక్షలు అవుతుంది. ఇందులోను 50 శాతం ముందస్తు సొమ్ము చెల్లించాలని, మిగిలిన సొమ్ముకు మాత్రమే లోన్‌కు వెళ్లాలనే షరతు ఉంటుందని కంపెనీ ప్రతినిధి ఒకరు వివరించారు.
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top