చూస్తే చాలు.. పేమెంట్ అయిపోతుంది! | Reliance Jio Announces Jio AI Glasses with UPI Language Translation and More | Sakshi
Sakshi News home page

Jio AI Glasses: చూస్తే చాలు.. పేమెంట్ అయిపోతుంది!

Oct 10 2026 2:48 PM | Updated on Oct 10 2026 3:00 PM

Reliance Jio Announces Jio AI Glasses with UPI Language Translation and More

టెక్నాలజీ రోజురోజుకూ కొత్త పుంతలు తొక్కుతోంది. ఒకప్పుడు డబ్బులు చెల్లించాలంటే చేతిలో నగదు ఉండాల్సిందే. కానీ.. ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్లు వచ్చాయి. ఇప్పుడు ఫోన్‌లోనే యూపీఐ యాప్స్ ద్వారా సెకన్లలో పేమెంట్స్ చేస్తున్నాం. అయితే.. ఇకపై పేమెంట్స్ చేయడానికి ఫోన్ బయటకు తీయాల్సిన అవసరం కూడా లేకుండా పోతోంది. ఎందుకంటే రిలయన్స్ జియో జియోఫ్రేమ్స్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ తీసుకొచ్చింది.

ఢిల్లీలోని యశోభూమిలో అక్టోబర్ 7 నుంచి 10 వరకు జరిగిన ఇండియా మొబైల్ కాంగ్రెస్ 2026లో జియో ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను ప్రదర్శించింది. వీటిలో చిన్న కెమెరా ఉంటుంది. దీని సాయంతో ఎదురుగా ఉన్న యూపీఐ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి, వాయిస్ కమాండ్స్ ద్వారా పేమెంట్ చేసే సదుపాయాన్ని అందించాలనేది దీని ప్రత్యేకత.

గ్లాసెస్‌తోనే చెల్లింపులు
ఉదాహరణకు.. మీరు ఒక షాపింగ్ మాల్‌లో వస్తువులు కొనుగోలు చేశారనుకుందాం. బిల్లు చెల్లించడానికి ప్రతిసారీ జేబులో నుంచి ఫోన్ తీసి, అన్‌లాక్ చేసి, పేమెంట్ యాప్ ఓపెన్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేయాల్సిన పని లేకుండా, ఈ గ్లాసెస్‌తోనే చెల్లింపులు చేయవచ్చు.

దీనికోసం.. ముందుగా హలో జియో అని చెప్పి, ఆ తర్వాత మీరు చేయాలనుకుంటున్న పేమెంట్ గురించి వాయిస్ కమాండ్ ఇవ్వవచ్చు. మీరు రూ.4,000 చెల్లించాలని చెప్పినప్పుడు, పేమెంట్ వివరాలను నిర్ధారించమని సిస్టమ్ అడుగుతుంది. మీరు అనుమతి ఇచ్చిన తర్వాత లావాదేవీ పూర్తవుతుంది.

12 భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్
ఈ గ్లాసెస్‌లో కేవలం పేమెంట్స్ మాత్రమే కాదు, మరికొన్ని ఆసక్తికరమైన ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో.. జియోరియాలిటీఓఎస్ ఆధారంగా పనిచేసే 12 భారతీయ భాషల్లో లైవ్ ట్రాన్స్‌లేషన్ సదుపాయం ఉన్నట్లు సమాచారం. అంటే మనకు తెలియని భాషలో ఎవరైనా మాట్లాడినా, వారి మాటలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే, 15 నిమిషాల వరకు సమావేశాలను రికార్డ్ చేసి, వాటిలోని ముఖ్యమైన విషయాలను సారాంశంగా అందించే ఫీచర్ కూడా ఉంది. దీంతో ఆఫీసు మీటింగ్స్‌లో చెప్పిన విషయాలను మళ్లీ గుర్తు చేసుకోవడం సులభమవుతుంది.

నెలకు రూ.15000
అయితే.. ఈ గ్లాసెస్‌ సాయంతో ఒక్కో లావాదేవీపై రూ.5,000 వరకు, నెలకు రూ.15,000 మాత్రమే ట్రాన్సక్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఫోన్ దగ్గర లేకపోయినా లేదా ఇంటర్నెట్ పనిచేయకపోయినా ఈ గ్లాసెస్ ద్వారా పేమెంట్స్ చేసుకోవచ్చా? అనే అంశంపై అధికారిక వివరాలు తెలియాల్సి ఉంది. ఎందుకంటే.. యూపీఐ పేమెంట్ జరగాలంటే అవసరమైన కనెక్టివిటీ, బ్యాంకింగ్ సదుపాయాలు పనిచేయాలి.

జియోఫ్రేమ్స్ వంటి ఏఐ గ్లాసెస్ అందుబాటులోకి వస్తే.. మనం రోజువారీగా చేసే పనులు మరింత సులభం అవుతాయి. ముఖ్యంగా పేమెంట్స్ కోసం ప్రతిసారీ ఫోన్ తీసే అవసరం తగ్గుతుంది. భాషలను అర్థం చేసుకోవడం, మీటింగ్స్ వివరాలను గుర్తుంచుకోవడం వంటి పనుల్లోనూ ఇవి ఉపయోగపడే అవకాశం ఉంది. అయితే.. వీటి ధర ఎంత?, మార్కెట్లోకి వచ్చే తేదీ?, పేమెంట్స్ ఎలా పనిచేస్తాయనే పూర్తి వివరాలు వెల్లడికావాల్సి ఉంది.

ఇదీ చదవండి: జియో రీచార్జ్‌: 30 రోజుల ప్లాన్.. 25జీబీ డేటా!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement