ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్‌గ్రేడ్‌పై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దృష్టి  | Reliance Infrastructure makes Rs 5,000 crore bet on aircraft upgrades | Sakshi
Sakshi News home page

ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్‌గ్రేడ్‌పై రిలయన్స్‌ ఇన్‌ఫ్రా దృష్టి 

Jun 9 2025 6:00 AM | Updated on Jun 9 2025 8:02 AM

Reliance Infrastructure makes Rs 5,000 crore bet on aircraft upgrades

డార్నియర్‌ యుద్ధ విమానాల కాంట్రాక్టు సొంతం 

5–10 ఏళ్లలో రూ.5,000 కోట్ల వ్యాపారంపై కన్ను

న్యూఢిల్లీ: యుద్ధ విమానాల అప్‌గ్రేడ్‌ (నవీకరణ/ఆధునికీకరణ) వ్యాపారంలోని అవకాశాలపై అనిల్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ ఇన్‌ఫ్రా కన్నేసింది. వచ్చే 5–10 ఏళ్ల కాలంలో రూ.5,000 కోట్ల వ్యాపార అవకాశాలను సొంతం చేసుకోవడం పట్ల కంపెనీ ఆశావహంగా ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఓఈఎం కాకుండా సొంతంగా సమగ్రమైన ఎయిర్‌క్రాఫ్ట్‌ అప్‌గ్రేడ్‌ కార్యక్రమాలను నిర్వహించే తొలి దేశీ కంపెనీగా రిలయన్స్‌ ఇన్‌ఫ్రా గుర్తింపు తెచ్చుకోనుంది. 

హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) నుంచి ఇప్పటికే 55 డార్నియర్‌ –228 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రేడ్‌ కాంట్రాక్టును సొంతం చేసుకోవడంతోపాటు విజయవంతంగా అమలు చేసినట్టు కంపెనీకి చెందిన విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అమెరికాకు చెందిన జెనెసిస్‌ కంపెనీ సహకారంతో ఈ కాంట్రాక్టును అమలు చేసినట్టు తెలిపాయి. మొదట 37 ఎయిర్‌క్రాఫ్ట్‌లకు సంబంధించి ఆర్డర్‌ సొంతం చేసుకోగా, అనంతరం మరో 18 ఎయిర్‌క్రాఫ్ట్‌ల అప్‌గ్రేడ్‌ కాంట్రాక్టు సైతం లభించినట్టు వెల్లడించాయి. ఈ మొత్తం ఆర్డర్‌ విలువ రూ.350 కోట్లు ఉంటుందని తెలిపాయి. ఈ డార్నియర్‌ యుద్ధ విమానాలు ఎయిర్‌ఫోర్స్, నేవీ, కోస్ట్‌ గార్డ్‌ వినియోగిస్తున్నవి కావడం గమనార్హం.  

భారీ మార్కెట్‌.. 

యుద్ధ విమానాలు, హెలీకాప్టర్ల జీవిత కాలం సాధారణంగా 30–40 ఏళ్లుగా ఉంటుంది. క్రమం తప్పకుండా వీటిని అప్‌గ్రేడ్‌ చేయడం అవసరం. ఎయిర్‌క్రాప్ట్‌ అప్‌గ్రేడ్, ఎంఆర్‌వో సేవల కోసం ఒక యుద్ధ విమానం కొనుగోలు ధరతో పోలి్చతే 200–300 శాతం వెచ్చించాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఈ మార్కెట్‌ రూ.5 లక్షల కోట్లుగా ఉంటే, వచ్చే ఏడేళ్లలో రూ.7 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనాలు నెలకొన్నాయి. తొలుత దేశీ మార్కెట్‌తోపాటు తదుపరి అంతర్జాతీయ మార్కెట్లో అవకాశాలను సొంతం చేసుకోవాలన్న వ్యూహాత్మక దృష్టితో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ సంస్థల భాగస్వామ్యంతో ప్రంపచస్థాయి పరిష్కారాలను అందించాలనుకుంటోంది. ఫ్రాన్స్‌కు చెందిన థేల్స్‌ భాగస్వామ్యంతో రిలయన్స్‌ ఇన్‌ఫ్రా ఇప్పటికే రఫేల్‌ ఫైటర్‌ జెట్స్‌కు సంబంధించి పనితీరు ఆధారిత లాజిస్టిక్స్‌ (పీబీఎల్‌) కార్యక్రమంలో కీలక సంస్థగా సేవలు అందిస్తోంది.   
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement