రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ పంజా | CBI Raids Reliance Communications Over Alleged LIC Bond Irregularities | Sakshi
Sakshi News home page

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌పై సీబీఐ పంజా

Apr 22 2026 7:05 PM | Updated on Apr 22 2026 7:29 PM

CBI Raids Reliance Communications Over Alleged LIC Bond Irregularities

ఒకప్పుడు టెలికాం రంగంలో అగ్రగామిగా వెలిగిన రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్‌) చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ)కు జారీ చేసిన బాండ్లు, రుణ పత్రాల (డిబెంచర్స్‌) వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) రంగంలోకి దిగింది. బుధవారం కంపెనీకి చెందిన వివిధ కార్యాలయాల్లో సీబీఐ అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహించి కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

రికార్డుల స్వాధీనం - సోదాల వివరాలు

రిలయన్స్ కమ్యూనికేషన్స్‌కు చెందిన నవీ ముంబై ప్రధాన కార్యాలయంతో పాటు పలు ఇతర ప్రాంతాల్లో సీబీఐ ఏకకాలంలో సోదాలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ప్రధానంగా 2009 నుంచి 2016 మధ్య కాలంలో ఎల్‌ఐసీకి జారీ చేసిన బాండ్లు, డిబెంచర్లు, కమర్షియల్ పేపర్స్‌కు సంబంధించిన రికార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

  • నవీ ముంబై కేంద్రంగా కంపెనీ కార్యకలాపాలు సాగే కీలక ప్రాంతాల్లో రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.

  • ఎల్‌ఐసీ పెట్టుబడులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్లు, అంతర్గత ఈమెయిల్స్, ఆర్థిక లావాదేవీల చిట్టాను సీబీఐ స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

  • ఈ దర్యాప్తు ప్రధానంగా 2009-2016 మధ్య జరిగిన లావాదేవీలపైనే కేంద్రీకృతమై ఉంది. ఆ సమయంలో కంపెనీ నిధుల సేకరణ కోసం అనుసరించిన మార్గాల్లో నిబంధనల ఉల్లంఘన జరిగిందనేది ప్రధాన ఆరోపణ.

దర్యాప్తు వెనుక అసలు కారణం?

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఎల్‌ఐసీ నుంచి రిలయన్స్ కమ్యూనికేషన్స్ భారీ మొత్తంలో నిధులను సేకరించింది. అయితే ఈ డిబెంచర్లు, బాండ్ల జారీ సమయంలో కంపెనీ తన ఆర్థిక పరిస్థితిని తప్పుగా చూపించిందా? లేదా నిధుల మళ్లింపు జరిగిందా? అనే కోణంలో సీబీఐ విచారణ జరుపుతోంది. ముఖ్యంగా పబ్లిక్ మనీ ఉన్న ఎల్‌ఐసీకి చెల్లించాల్సిన బకాయిల విషయంలో కంపెనీ వైఫల్యం చెందడం, అంతకుముందు జరిగిన ఒప్పందాల్లో పారదర్శకత లోపించడం వంటి అంశాలు ఈ సోదాలకు దారితీశాయి.

ఇదీ చదవండి: టిఫిన్‌, కర్రీ ప్యాకెట్‌ ధర 50 శాతం పెంపు!

Advertisement
 
Advertisement
Advertisement