రిలయన్స్ కమ్యూనికేషన్స్ (ఆర్‌కామ్) నిధుల మళ్లింపునకు సంబంధించి రూ.27,300 కోట్ల భారీ బ్యాంకు మోసం కేసులో సుప్రీంకోర్టు కీలక విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనిల్ అంబానీ తరఫు న్యాయవాదులు వినిపించిన వాదనలు సర్వత్రా చర్చనీయాంశమయ్యాయి. వివాదాస్పద లావాదేవీల్లో అనిల్ అంబానీ ఎవరినీ మోసం చేయలేదని, బహుశా అతనే మోసపోయి ఉండవచ్చునని న్యాయస్థానం ముందు పేర్కొన్నారు.
దర్యాప్తు సంస్థల నివేదిక
ఈ కేసులో సీబీఐ, ఈడీ దర్యాప్తు పురోగతిని కోర్టుకు వివరించాయి. రూ.27,300 కోట్ల నిధుల మళ్లింపుపై విచారణ సరైన దిశలోనే సాగుతోందని సీబీఐ స్పష్టం చేసింది. ఇప్పటికే ఈ కేసులో ఇద్దరిని అరెస్టు చేశామని, తదుపరి విచారణలో మరిన్ని కీలక అరెస్టులు జరిగే అవకాశం ఉందని ఏజెన్సీ వెల్లడించింది. అయితే, నిధుల మళ్లింపులో అంబానీ పాత్రపై స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ఆరోపిస్తున్న పిటిషనర్, ఇప్పటివరకు ఆయనను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
పిటిషనర్ వాదనలపై స్పందించిన సుప్రీంకోర్టు, దర్యాప్తు ప్రక్రియను సంచలనాత్మకం చేయవద్దని హెచ్చరించింది. ‘అరెస్టు చేయాలని ఆదేశించడానికి కోర్టు సంకోచిస్తోంది. కస్టోడియల్ విచారణ అవసరమా లేదా అనేది దర్యాప్తు సంస్థలైన సీబీఐ, ఈడీలే నిర్ణయించాలి. ఆ బాధ్యత వారిదే’ అని ధర్మాసనం అభిప్రాయపడింది.
ఆస్తుల అటాచ్‌మెంట్‌పై అభ్యంతరం
ఢిల్లీలో విద్యుత్ సరఫరా చేసే బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, యమునా పవర్ లిమిటెడ్‌లలోని రూ.1,575 కోట్ల విలువైన షేర్లను దర్యాప్తు సంస్థలు అటాచ్ చేయడంపై అంబానీ తరఫు న్యాయవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకే గ్రూపునకు చెందిన కంపెనీలు కావడమే ఈ చర్యకు కారణమని, ఇది ఉద్దేశపూర్వకమని వాదించారు. అటాచ్‌మెంట్ వల్ల వర్కింగ్ క్యాపిటల్ స్తంభించిపోతుందని, తద్వారా దేశ రాజధానిలోని కోట్లాది మంది వినియోగదారులకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
కేసు నేపథ్యం
రిలయన్స్ కమ్యూనికేషన్స్, దాని అనుబంధ సంస్థలకు చెందిన బ్యాంకు నిధులను ఇతర అవసరాలకు మళ్లించారని, తద్వారా బ్యాంకులకు భారీ నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థలు ఆరోపిస్తున్నాయి. ఈ భారీ ఆర్థిక కుంభకోణంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కొనసాగుతోంది. తదుపరి విచారణలో దర్యాప్తు సంస్థలు సమర్పించే నివేదికలు అనిల్ అంబానీ భవిష్యత్తును నిర్ణయించనున్నాయి.
ఇదీ చదవండి: భయం వద్దు.. నైపుణ్యమే హద్దు


